ప్రాదేశిక ఎన్నికల్లోనూ సత్తా చాటుతాం

కష్టపడ్డ వారికే అవకాశాలు: ఎమ్మెల్యే
కామారెడ్డి,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి):  రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో గెలుపు జెండాను మరోమారు ఎగుర వేసేందుకు టీఆర్‌ఎస్‌ పార్టీ సిద్ధం అవుతోంది. ఎమ్మెల్యే ఎలక్షన్లు, పంచాయతీ పోరు, పార్లమెంట్‌ ఎన్నికల్లాగా పరిషత్‌ ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు గులాబీ దళం కదులుతోంది. పార్లమెంట్‌ ఎన్నికలు ముగిసిన దరిమిలా ఇప్పుడు తమ దృష్టి ఈ ఎన్నికలపై ఉందని ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి అన్నారు. జిల్లాల్లో జడ్పీ పీఠాలను కైవసం చేసుకుంటామని అన్నారు. ఇప్టపికే గెలుపునకు సంబంధించి అనుసరించా ల్సిన వ్యూహాలపై చర్చించామన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల ఎంపికపైనా సలహాలు, సూచనలు చేస్తూనే వీటి బాధ్యతలను స్థానిక ఎమ్మెల్యేలకే అప్పగించారు. మరోవైపు ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు, ఓటర్ల జాబితా, పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు పక్రియ పూర్తయ్యింది. సిబ్బందికి ఈ  శిక్షణ కార్యక్రమాలు సైతం పూర్తి చేశారు.  సర్పంచ్‌ ఎన్నికలతో పోలిస్తే పరిషత్‌ ఎన్నికల నాటికి ఓటర్ల సంఖ్య పెరగడం మూలంగా పోలింగ్‌ బూత్‌లు సైతం పెరుగుతున్నాయి. శాసనసభ్యులంతా గెలుపు గుర్రాలను అన్వేషిస్తున్నారు.  టీఆర్‌ఎస్‌ తరపున జడ్పీ చైర్మన్ల పోటీలో ఎవరుంటారనేది కూడా ముందే నిర్ణయించి జాబితా సిద్ధం చేసే అవకాశం ఉంది. పార్టీలో చాన్నాళ్ల నుంచి పదవుల కోసం ఎదురు చూస్తున్న వారికి అవకాశాలు కల్పిస్తే, అసంతృప్తుల బెడద తగ్గించుకోవచ్చని భావిస్తున్నట్లుగా సమాచారం. మరోవైపు జడ్పీ పీఠాల కోసం జిల్లాలో కీలక నేతలు ఎదురు చూస్తున్నారు. బీసీ మహిళకు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవి రిజర్వ్‌ కావడంతో కీలక నేతల భార్యలే రంగంలోకి దిగే వీలుంది. గెలుపు ఉత్సాహంతో ఉన్న టీఆర్‌ఎస్‌ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించింది. కామారెడ్డి జిల్లా పరిషత్‌ స్థానాల్లో గెలుపుతో పాటుగా జడ్పీ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు గులాబీ పార్టీ సిద్ధం అవుతోంది. అన్ని స్థానాలు గెలుచు కోవడమే కాకుండా జడ్పీ చైర్మన్‌, ఎంపీపీ స్థానాలు కైవసం చేసుకుంటామని జీవన్‌ రెడ్డి అన్నారు. అందరికీ ఆమోదయోగ్యంగా, గెలుపు అవకాశాలున్న వ్యక్తులకే చోటు దక్కుతుందని అన్నారు.  గెలుపు బాధ్యతలు ఎక్కువ శాతం ఎమ్మెల్యేలకు ప్రతిష్ఠాత్మకం కావడంతో వారిపైనే బాధ్యత ఎక్కువ ఉందన్నారు.