ప్రైవేట్‌ పోటీలో వెనకబడుతున్న జూనియర్‌ విద్యార్థులు

సంగారెడ్డి, ఫిబ్రవరి8(జ‌నంసాక్షి): ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదివే వారిలో ఎక్కువగా పేదలే ఉంటారు. సొంత గ్రామాల్లో కళాశాల లేకపోవడంతో పొరుగూరుకు పయనయ్యే విద్యార్థుల ఇబ్బందులు మరింత దయనీయం. ఫలితాల్లోనూ ప్రైవేటు జూనియర్‌ కళాశాలల్లో చదివే విద్యార్థులతో పోల్చుకుంటే వెనుకబడుతున్నారు. దీన్ని గుర్తించిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లోనూ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదివే విద్యార్థులు పౌష్టికాహార లోపం కారణంగా ఫలితాల్లో వెనుకబడుతున్నారు. ఖాళీ కడుపుతో అల్లాడుతున్న విద్యార్థులకు అధ్యాపకులు బోధించే విషయాలు ఒంటబట్టని పరిస్థితి. ఇంటర్‌ చదివేందుకు చాలా మంది విద్యార్థులు ఉదయం ఏడు గంటలకే బయలుదేరి పొరుగూరికి వెళ్లే విద్యార్థులు టిఫిన్‌ బాక్సులు లేకుండానే వెళుతున్నారు. సాయంత్రం వరకు ఏవిూ తినకుండా ఉంటుండడంతో చదువులో వెనుకబడటమే కాకుండా ఆరోగ్యపరంగానూ సమస్యలు తప్పడంలేదు. న్యాల్‌కల్‌లో జూనియర్‌ కళాశాలకు చేరుకునేందుకు మల్గి గ్రామానికి చెందిన విద్యార్థులు చౌరస్తా వరకు నిత్యం రానుపోను ఏడు కి.విూ నడవాల్సివస్తోంది. టేకూరు నుంచి న్యాల్‌కల్‌, హద్నూరకు వెళ్లే విద్యార్థులకు ఇదే ఇబ్బంది. కొండాపూర్‌ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు గంగారం, మారేపల్లి, మాందాపూర్‌, తేర్‌పోల్‌, మాచేపల్లి, దొబ్బకుంట నుంచి విద్యార్థులు వస్తుంటారు. అలియాబాద్‌ నుంచి నడుచుకుంటూ వస్తారు. పుల్కల్‌లోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. సంగారెడ్డి, సదాశివపేటకు పరిసర గ్రామాలకు చెందిన విద్యార్థులు ఉదయమే బయలుదేరి జూనియర్‌ కళాశాలలకు వస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు ఆకలితో అలమటిస్తూ చదువుపై దృష్టిసారించలేకపోతున్నారు.  జిల్లాలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, ఆదర్శ జూనియర్‌ కళాశాలలు, సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలు, బీసీ సంక్షేమ గురుకుల కళాశాలలు కలిపి 41 ఉండగా ప్రైవేటు జూనియర్‌ కళాశాలలు 54 ఉన్నాయి. ఆయా కళాశాల్లో సాధారణ, వృత్తివిద్య కోర్సుల్లో కలిపి దాదాపు ఏడువేల మంది విద్యార్థులకు పౌష్టికాహారం అందే అవకాశం ఉంటుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పథకం అమలుకోసం అవసరమైన కసరత్తుచేస్తున్నారు.