ప్లాస్టిక్‌ నిషేధంపై కొరవడిన చిత్తశుద్ది

కఠిన చర్యలు లేకపోవడంతో అమలు కాని హావిూ

హైదరాబాద్‌,ఆగస్ట్‌18(జ‌నం సాక్షి): నగర పాలకసంస్థ అనుసరిస్తున్న విధానాల వల్ల హైదరాబాద్‌ నగరంలో ప్లాస్టిక్‌ వాడకంపై నిసేధం పెద్దగా ప్రభావం చూపలేకపోతోంది. ప్రచారాలతో పని కాదని మరోమారు రుజువయ్యింది. టపన్నుల కొద్దీ ప్లాస్టిక్‌ వినియోగం కారణంగా హైదరాబాద్‌ వీధులన్నీ ప్లాస్టిక్‌ కవర్లతోచెత్తను నింపుకుని నిత్యం దర్శనమిస్తూనే ఉన్నాయి. మురికి కాలువల్లో ఎక్కడ చూసినా ఇవే దర్శనం ఇస్తున్నాయి. పాలకవర్గం అసమర్థతతో, అధికారుల అలసత్వంతో ప్లాస్టిక్‌ నిషేధం ప్రసహనంగా తయారైంది. కేవలం దుకాణాలపై అడపాదడపా దాడులు చేసి వారికి చలానాతో జరిమానా విధిస్తున్నారు. కనీసంగా ప్రచారం లేకపోవడంతో పాటు, సడన్‌గా వచ్చి తమవద్ద వేయి నుంచి ఐదువేల వరకు జరిమానా వసూలు చేస్తున్నారని దుకాణాదారులు మండి పడుతున్నారు. నగరపాలక సంస్థలో టిఆర్‌ఎస్‌ అధికారం చేపట్టినా ప్లాస్టిక్‌ నిషేధంపై నీలినీడలు కమ్ముకున్నాయి. సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధం అమలు చేస్తామని ప్రకటించింది. అధికారుల ఉదాసీనత, నిర్లక్ష్యం కారణంగా ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. నగర పరిధిలో పారిశుధ్య నిర్వహణ ద్వారా ప్రతిరోజు సుమారుగా టన్నులు మేర చెత్తాచెదారం సేకరిస్తున్నారు. అందులో సగం ప్లాస్టిక్‌ సంబంధిత వ్యర్థాలే ఉంటున్నాయి. ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణ లేకపోవటంతో విచ్చలవిడిగా ప్లాస్టిక్‌ వినియోగం జరుగుతున్నది. ప్రధానంగా 40 మైక్రాన్ల లోపు ప్లాస్టిక్‌నే అత్యధిక సంఖ్యలో వినియోగిస్తున్నారు. గతంలో ప్లాస్టిక్‌ నిషేధంపై ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసి తనిఖీలను చేశారు. ఈ తనిఖీల్లో ప్లాస్టిక్‌ అమ్మకపుదారులకు రెండువేల నుంచి ఐదువేల వరకు అపరాధ రుసుం పేరుతో వసూలు చేశారు. అయితే ప్రత్యామ్నాయం చూపకుండా అధికారుల దాడులను కొందరు వ్యాపారస్తులు తప్పుపట్టారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 40 మైక్రాన్లు దాటిన కవర్లు మాత్రమే వినియోగించాల్సి ఉంది. ప్లాస్టిక్‌ వినియోగంతో క్యాన్సర్‌ వంటి వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు సూచిస్తున్నారు.అధికారులు స్పందించకపోవటం వెనుక వ్యాపారస్తులు ఇచ్చే మాముళ్లకు అలవాటుపడి ఈ రకంగా మిన్నకుండిపోయారనే విమర్శలు వినబడుతున్నాయి. ప్లాస్టిక్‌ కవర్లు వాడితే జరిమానాలు వేయటం కన్నా అవగాహన కల్పించటం ఉత్తమమనిఅంటున్నారు. ప్రత్నామ్నాయం చూపించాల్సిన భాధ్యత ప్రభుత్వంపై ఉంది. వ్యాపారస్తులపై కఠినంగా వ్యవహరించటం కన్నా ప్లాస్టిక్‌ తయారు చేసే పరిశ్రమలను మూసి వేస్తే ప్రయోజనం ఉంటుందన్న సూచనలు ఉన్నాయి.