ప్లీనరీలో హరీష్ రావు ప్రతిజ్ఞ..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్ ద్వారా కోటి ఎకరాలకు నీరందించేందుకు కృషి చేస్తానని అంటూ తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు ప్రతిజ్ఞ చేశారు. ఖమ్మంలో టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో హరీష్ రావు ప్రాజెక్టులపై సుదీర్ఘంగా ప్రసంగించారు. నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, ఇరిగేషన్ శాఖపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారని తెలిపారు. తెలంగాణ శాసనసభలో కేసీఆర్ ఇచ్చిన ప్రజెంటేషన్ ను కీర్తించారని తెలిపారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఉత్తర తెలంగాణకు వర ప్రదాయిని అని, 1400 టీఎంసీల నీళ్లు గోదావరిలో కలుస్తున్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఉత్తర తెలంగాణకు నీళ్లు తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. లోయన్ పెనుగంగ విషయంలో మహారాష్ట్ర సర్కార్ తో చర్చించి టెండర్లు పిలవడం జరుగుతోందన్నారు. ఆదిలాబాద్ తూర్పు జిల్లాలకు చెందిన ప్రాజెక్టులకు రీ డిజైన్ చేసి లక్షల ఎకరాలకు నీళ్లు అందించడానికి కృషి చేయడం జరుగుతోందన్నారు. పలు జిల్లాలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టుల వివరాలను హరీష్ రావు వివరించారు.