ఫిబ్రవరి12 నుంచి అంతర్వేది తిరునాళ్లు

భారీగా ఏర్పాట్లు చేస్తున్న సన్నాహక కమిటీ

అధికారులతో సవిూక్షించిన ఎమ్మెల్యే గొల్లపలి

కాకినాడ,జనవరి23(జ‌నంసాక్షి): అంతర్వేది శ్రీలక్ష్మీ నర్శింహస్వామి తిరునాళ్ళ సందర్భంగా విచ్చేసే యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని రాజోలు ఎంఎల్‌ఎ గొల్లపల్లి సూర్యారావు అధికారులను ఆదేశించారు. బుధవారం రాజోలు ఎంఆర్‌సి కార్యాలయంలో అంతర్వేది ఉత్సవాల నిర్వాహణ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో ఎంఎల్‌ఎ గొల్లపల్లి సూర్యారావు సవిూక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంఎల్‌ఎ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 12 వ తేదీ నుండి 20 వరకు నిర్వహించనున్న అంతర్వేది ఉత్సవాలకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో యాత్రికులు విచ్చేయనున్నారన్నారు. యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. శాఖలవారీగా అప్పగించిన పనులను ఆయా అధికారులు ప్రత్యేక శ్రద్ధతో నిర్వహించాలని ఆదేశించారు. పట్టణంలో పారిశుద్ధ్యం, భద్రతా ఏర్పాట్లు, ఆరోగ్య సేవలు, గజ ఈతగాళ్ళు తదితర ఏర్పాట్లుపై దృష్టిసారించాలని సూచించారు. ఫిబ్రవరి 15 న స్వామి వారి తిరు కల్యాణ మ¬త్సవం, రథోత్సవం, 19 న పౌర్ణమి సముద్ర స్నానాలకు భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని తెలిపారు. ఆయా ప్రత్యేక రోజుల్లో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైల్వే స్టేషన్‌, బస్టాండ్‌, మాధవాయిపాలెం ఫెర్రీ వద్ద 24 గంటలూ సిబ్బంది సేవలందించాలన్నారు. ఆరోగ్య శాఖ ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేయాలని, మత్స్యశాఖ గజ ఈతగాళ్ళను అందుబాటులో ఉంచాలన్నారు. ప్రయాణికులను చేరవేసే పంటులో పరిమితికి మించి యాత్రికులను అనుమతించకూడదన్నారు. ఆర్టీసీ సంస్థ ప్రయాణీకులను అంతర్వేది దేవస్థానానికి చేరవేసేందుకు ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో అంతర్వేది దేవస్థానం సహాయ కమిషనర్‌ ఎం.లక్ష్మీనారాయణ, డెల్టా కమిటీ చైర్మన్‌ భూపతిరాజు ఈశ్వరరాజు వర్మ, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు ముప్పర్తి నాని, అనుచూరి పురుషోత్తం, ఆర్టీసి, ఆర్‌అండ్‌ బి.రెవిన్యూ, పంచాయతీ రాజ్‌, మత్స్యశాఖ, ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.