ఫిల్మ్నగర్ ఘటనపై కేటీఆర్ గరంగరం

హైదరాబాద్ : నగరంలోని జూబ్లీహిల్స్ ఫిల్మ్‌నగర్‌లో ఓ అక్రమ నిర్మాణం కుప్పకూలిన ఘటనపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో స్థానిక టౌన్ ప్లానింగ్ అధికారి పై సస్పెన్షన్ వేటు వేశారు. అలాగే ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్, ఇంజినీర్, కాంట్రాక్టర్ పై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.

ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్(ఎఫ్‌ఎన్‌సీసీ)లో అనుమతి లేకుండా నిర్మిస్తున్న పోర్టికో పిల్లర్లతోపాటు ఆదివారం ఒక్కసారిగా పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు కూలీలు మృత్యువాతపడగా.. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. స్వల్ప వ్యవధిలో బీమ్స్, శ్లాబ్ వేయడం, పిల్లర్లు నాసిరకంగా ఉండటమే ఈ దుర్ఘటనకు కారణమని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించిన విషయం తెలిసిందే.