ఫీజుల దోపిడీకి ఇక కళ్లెం

ఫీజులపై ప్రభుత్వ అజమాయిషీ
పర్యవేక్షక కమిటీకి బాధ్యతలు
హైదరాబాద్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): ప్రైవేట్‌ రంగంలో ఫీజులకు కళ్లెం పడనుంది. ఇక ప్రభుత్వ అజమాయిషీలో ఫీజులను నిర్ణయిస్తారు. ఫీజుల దోపిడీని అరికట్టేందుకు కార్యాచరణ సిద్దం అవుతోంది. ఉన్నత కమిటీని ఏర్పాటుచేసి, తల్లిదండ్రులను అందులో భాగస్వామ్యం చేస్తారు. దీంతో ఫీజుల పేరుతో దోపిడీకి పగ్గం వేయనున్నారు. రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజుల వసూళ్లను నియంత్రించడానికి పాఠశాల విద్యాశాఖ చర్యలు తీసుకుంటున్నది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి సర్కారు నిర్ణయించిన ఫీజులనే వసూలు చేసేలా కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు తయారుచేసి ప్రభుత్వానికి పంపారు.  ఆ తర్వాత అధిక ఫీజుల నియంత్రణకు అవసరమైన నూతన మార్గదర్శకాలతో జీవో విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. స్కూల్‌ ఫీజులను జిల్లా విద్యాధికారి ఆధ్వర్యంలో నియంత్రించనున్నారు. ఈ మేరకు జిల్లా ఫీజు రెగ్యులేషన్‌ కమిటీలు ఏర్పాటు చేస్తారు. కమిటీలో సభ్యులుగా తల్లిదండ్రులకు కూడా అవకాశం కల్పిస్తారు. ఆదాయ వ్యయాలు అంచనా వేసి, ఆడిట్‌ నివేదికలను పరిశీలించిన తర్వాత స్కూల్‌ వారీగా ఫీజుల ప్రతిపాదనలు తయారు చేసి పరిశీలన కోసం ప్రభుత్వానికిపంపుతారు. వాటికి ఆమోదం లభిస్తే ఫీజుల పట్టిక అమలులోకి వస్తుంది. అయితే గ్రావిూణ ప్రాంతాలు, చిన్న చిన్న ప్రైవేటు స్కూళ్లలోని పరిస్థితులు అంచనా వేసి ఫీజులను ఖరారు చేయాలని, పెద్ద స్కూళ్లను చిన్న స్కూళ్లను ఒకే గాటన కట్టి ఫీజులను నిర్ణయించవద్దని తెలంగాణ ప్రైవేటు స్కూల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర నాయకుకోరుతున్నారు. కార్పొరేట్‌ స్కూళ్లు, గ్రావిూణ ప్రాంత స్కూళ్లను కేటగిరీలుగా విభజించాలని, అలాగే ఫీజుల నియంత్రణ కోసం ఏర్పాటు చేసే రాష్ట్రస్థాయి కమిటీలో తమకు భాగస్వామ్యం కల్పించాలని ప్రైవేటు స్కూల్‌ యాజమాన్యాలు విన్నవిస్తున్నాయి. మరోవైపు ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని తెలంగాణ తల్లిదండ్రుల సంఘం రాష్ట్ర నాయకులు ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్‌ తదితర రాష్ట్రాల్లో ఫీజుల నియంత్రణ పక్రియ జరుగుతున్నదని, అదే తరహాలో మన రాష్ట్రంలోనూ అమలు చేసి పేద విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నారు.