ఫుట్‌బాల్‌లో మనం గోల్‌ చేయలేమా?

క్రికెట్‌లో జగజ్జేతగా నిలిచిన భారత్‌ సాకర్‌ పోటీల్లో మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. 130 కోట్ల జనాభా ఉన్న అతిపెద్ద దేశంలో ఫుట్‌బాల్‌కు ఎందుకింత నిర్లక్ష్యం జరుగుతోందో పాలకులు ఆలోచించాలి. వివిధ క్రీడల్లో అంతంతమాత్రంగా అయినా అభినివేశం సంపాదించుకుంటున్న వేళ సాకర్‌లో అడుగు వేయలేక పోతున్నాం. దీనిని తీవ్రమైన సమస్యగా గుర్తించి పుట్‌బాల్‌ క్రీడను పెద్ద ఎత్తున ప్రోత్సాహించాల్సి ఉంది. ఆటంలే కేవలం క్రికెట్‌ అన్న భావన నుంచి బయటపడాలి. బ్యడ్మింటన్‌, చెస్‌, హాకీ, కబడ్డీల్లో రాణిస్తున్న మనం సాకర్‌పై ఇక దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. నెలరోజులు అత్యంత ఆసక్తిగా సాగిన ప్రతిష్ఠాత్మక ఫిఫా ప్రపంచ కప్‌ సాకర్‌ సమరం అభిమానులను ఉర్రూతలూగించింది. 32 దేశాలు పోటీపడ్డ ఈ క్రీడోత్సవం ఫుట్‌బాల్‌ ప్రేమికులను గోల్‌ ఫీవర్‌లో ముంచెత్తింది. తుదిపోరులో సంచలనాల జట్టు క్రొయేషియాను ఓడించి ఫ్రాన్స్‌ విశ్వవిజేతగా అవతరించింది. సాకర్‌ ప్రపంచ కప్‌ రష్యాలో జరుగుతుంటే ఎప్పటిలాగే మనం సంబరాలు చేసుకున్నామే తప్ప దానిపై చర్చించలేదు. మనవాళ్లు ఎందుకు లేరన్న భావన ఎక్కడా కనిపించలేదు. ఓవైపు చిన్నాచితకా దేశాలు చాంపియన్లుగా వెలుగొందుతుంటే ప్రపంచంలో రెండో అతిపెద్ద జనాభా కలిగిన భారత్‌ మాత్రం కనీసం టోర్నీలో అడుగిడే అవకాశాన్ని కూడా దక్కించు కోలేకపోయింది. విశ్వవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఫుట్‌బాల్‌ మన దేశంలో విసృతస్థాయిలో పురోగతి సాధించక పోవడానికి కారణాలు అన్వేషించాలి. బైచుంగ్‌ భూటియా, సునీల్‌ ఛెత్రిలాంటి ఆటగాళ్లు ప్రతి రాష్ట్రం నుంచి ఉద్భవించేలా చూసుకోవాల్సిన అవసరముంది. అసోం పంటపొలాల్లో పుట్టి, ఫుట్‌బాల్‌ ప్లేయర్‌గా ఎదిగి, రెండేళ్ళలో రన్నర్‌గా మారి ప్రపంచ అథ్లెటిక్‌ చాంపియన్‌ షిప్‌లో దేశానికి స్వర్ణాన్ని సాధించిపెట్టిన హిమాదాస్‌ వంటి మాణిక్యాలను వెతికిపట్టుకొని, అండగా నిలవాల్సిన అవసరం ఉన్నది. పెద్ద సంఖ్యలో అకాడవిూలను ప్రారంభించి, ప్రపంచస్థాయి శిక్షణ అందేలా ఏర్పాట్లు చేసినప్పుడు మన ఫుట్‌బాల్‌ కచ్చితంగా రాణిస్తుంది. దానికి కావాల్సింది చిత్తశుద్దే కాని మరోటి కాదు. అకాడవిూలను పెంచి రాష్ట్రాల స్థాయిలో ఆటగాళ్లను తయారు చేసుకోవాలి. చైనాలాగా చిన్నతనం నుంచే క్రీడల్లో రాణించేలా సానపట్టాలి.ఫైనల్‌ చేరిన ఫ్రాన్స్‌, క్రొయేషియా జట్ల ప్రదర్శన ప్రశంసనీయం. ఈ రెండూ సమవుజ్జీల సమరానికి నిదర్శనంగా నిలిచాయి. 41 లక్షల జనాభా కలిగిన చిన్నదేశం క్రొయేషియా తమకంటే ఎంతో మెరుగైన జట్లను చిత్తుచేసిన తీరు ప్రశంసనీయం. 1950లో ఉరుగ్వే తర్వాత విశ్వ కప్పు తుదిసమరంలో నిలిచిన అతి చిన్న దేశంగా ఫుట్‌బాల్‌ చరిత్రలో అది తన పేరు లిఖించుకుంది. టోర్నీకి స్టార్‌ ¬దాలో వచ్చిన అగ్రజట్లన్నీ పేలవ ప్రదర్శనతో ఉసూరుమనిపిస్తే, ఏమాత్రం అంచనాలు లేని క్రొయేషియా ఏకంగా ఫైనల్‌ ప్రదర్శనతో సంచలనం సృష్టించింది. టోర్నీ ఆద్యంతం అత్యుత్తమంగా రాణించిన ఆటగాడిగా క్రొయేషియాకు చెందిన లుకా మోద్రిచ్‌ గోల్డెన్‌ బాల్‌ పురస్కారాన్ని సొంతం చేసుకున్నాడు. గత ప్రపంచ కప్‌లకు ఏమాత్రం తీసిపోని విధంగా రష్యా టోర్నీని సమర్ధవంతంగా నిర్వహించి ప్రపంచ దేశాల ప్రశంసలు అందుకుంది. నాలుగేళ్లకోసారి జరిగే ఈ ప్రపంచకప్‌ మళ్లీ 2022లో కతార్‌ వేదికగా జరగనుంది. ఇకపోతే డోపింగ్‌ మరకలు.. ఇంకోవైపు అరాచకంగా తయారైన స్థానిక అభిమానుల నుంచి ఏ ముప్పు తలెత్తుతుందో అన్న ఆందోళన.. ఇలాంటి పరిస్థితుల్లో రష్యా ఆతిథ్యమిచ్చిన ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌పై సర్వత్రా ఆసక్తి రేగింది. ఆ సందేహాలన్నింటికీ రష్యా తెరదించుతూ సాకర్‌ సంబరానలు సాఫీగా పూర్తి చేసింది. ఈ ప్రపంచకప్‌ పూర్తిగా ఆట చుట్టూనే తిరిగింది. ఆటేతర వివాదం ఒక్కటీ కానరాలేదు. నిర్వహణలో లోపాల్లేకుండా రష్యా తీసుకున్న జాగ్రత్తలు ప్రపంచ దేశాలను మరిపించింది. ఇదంతా ఒకెత్తయితే.. ఈసారి

టోర్నీ సాగిన తీరు మరో ఎత్తు. ఆతిథ్య రష్యా మెరుపులతో ఆరంభమైన తొలి పోరు నుంచి.. నాటకీయ మలుపులతో ఉర్రూతలూగిస్తూ సాగిస్తూ సాగిన ఫైనల్‌ వరకు ప్రతి మ్యాచ్‌ కనువిందయ్యింది. టోర్నీ మొత్తంలో గోల్‌ లేని డ్రా ఒక్కటే అంటేనే ఈ టోర్నీ ఎంత బాగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఈసారి తిరుగులేని ఉత్కంఠను, వినోదాన్ని అందించిన మ్యాచ్‌లకు లెక్కే లేదు. రొనాల్డో విశ్వరూపం చూపించిన పోర్చుగల్‌-స్పెయిన్‌ మ్యాచ్‌ కావచ్చు.. జర్మనీకి దిమ్మదిరిగేలా చేసిన మెక్సికోతో పోరు కావచ్చు.. బెల్జియం-జపాన్‌ మధ్య అనూహ్య మలుపుతో సాగిన ప్రిక్వార్టర్స్‌ సమరం కావచ్చు.. బ్రెజిల్‌-మెక్సికో.. ఇంగ్లాండ్‌-క్రొయేషియా.. స్పెయిన్‌-రష్యా.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని మజా ఇచ్చిన మ్యాచ్‌లకు లెక్కే లేదు. అంచనాల్లేకుండా బరిలోకి దిగిన దేశాలు అదరగొట్టాయి. జర్మనీ, బ్రెజిల్‌, అర్జెరటీనా, స్పెయిన్‌, ఫ్రాన్స్‌, పోర్చుగల్‌.. ఫైనల్‌ చేరే జట్లేవంటే ఈ ఆరింట్లో రెండు జట్ల పేర్లనే ఎక్కువ శాతం మంది చెప్పి వుంటారు. కానీ చివరకు మిగిలింది ఫ్రాన్స్‌ మాత్రమే. పేలవ ప్రదర్శనతో ఒక దాని తర్వాత మరొకటి ప్రపంచకప్‌ గడప నుంచి నిష్కమ్రించాయి. అనూహ్యంగా అసలు ఎలాంటి అంచనాలు లేకుండా గ్రూప్‌ దశ దాటితేనే గొప్ప అనుకున్న జట్లు కాస్త నాకౌట్‌తో సత్తా చాటాయి. క్రొయేషియా తుది పోరుకు అర్హత పొంది అబ్బుర పరిస్తే.. రష్యా ఆతిథ్యంతో పాటు ఆటతోనూ అదరగొట్టింది. ఏకంగా స్పెయిన్‌కు షాకిచ్చి క్వార్టర్‌ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ అనుభవాలు మనకు గుణపాఠం కావాలి. మనమూ సాకర్‌లో నిలవాలన్న పట్టుదల రావాలి. మరో నాలుగేళ్లలో 2022లోవచ్చే ప్రపంచ సాకర్‌కుసన్నద్దం కావాలి. ఈ దిశగా పునాది పడితే అంతకుమించిన భాగ్యం ఉండబోదు. కనీసం పోటీల్లో స్థానం సాధించే దిశగా అయినా ఎదిగి త్రివర్ణ పతకాం రెపరెపలాడించాలి.