ఫైజాబాద్‌ ఇకనుంచి అయోధ్య జిల్లా

 

లక్నో స్టేడియానికి వాజ్‌పేయ్‌ పేరు

కీలక నిర్ణయం ప్రకటించిన సిఎం యోగి ఆదిత్యనాథ్‌

లక్నో,నవంబర్‌6(జ‌నంసాక్షి): ఉత్తరప్రదేశ్‌లో పలు ప్రాంతాల పేర్లను మారుస్తున్న కర్రమంలో తాజాగా ఫైజాబాద్‌ జిల్లా పేరును అయోధ్యగా మార్చారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ మంగళవారంనాడు పేరు మార్పును ప్రకటించారు. అయోధ్య పట్టణంలో దీపావళి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యోగి మాట్లాడుతూ, అయోధ్య మనకు గర్వకారణమని, అయోధ్య అంటేనే రాముడని అన్నారు. ఇవాల్టి నుంచి ఫైజాబాద్‌ జిల్లా అయోధ్యగా పేరుమార్పు సంతరించుకుంటుందని ప్రకటించారు. జిల్లా పేరు మార్పుతో పాటు అయోధ్య పట్టణానికి త్వరలోనే విమానాశ్రయం వస్తుందని, దానికి రాముడి

పేరు పెడతామని, వైద్యకళాశాల కూడా రానుందని, దానికి రాముడి తండ్రి దశరధుని పేరు పెడతామని యోగి ఆదిత్యనాథ్‌ ప్రకటించారు. ఇకపోతే లక్నోలోని భారత రత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఏకన క్రికెట్‌ స్టేడియాన్ని మంగళవారం ప్రారంభించారు. అంతకు ముందు ఈ స్టేడియానికి ఏకన ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియం అనే పేరుండేది. కాగా ఈ స్టేడియం పేరును ఒకరోజు ముందు అంటే సోమవారమే మార్చారు. భారత మాజీ ప్రధాని, స్వర్గీయ అటల్‌ బిహారీ వాజ్‌పేయి గౌరవార్థం ఈ స్టేడియానికి ఆయన పేరు పెట్టినట్లు సీఎం యోగి తెలిపారు. లక్నో ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియం కెపాసిటీ 50వేల మంది కాగా, భారత్‌, వెస్ట్‌ ఇండీస్‌ మధ్య ఈ స్టేడియంలో రెండో టీ20 మ్యాచ్‌ జరగనుంది. అయితే మ్యాచ్‌కు ఒక్క రోజు ముందు స్టేడియం పేరు మార్చడాన్ని సమాజ్‌వాదీ పార్టీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. అప్పట్లో సీఎంగా ఉన్న అఖిలేష్‌ యాదవ్‌ హయాంలో లక్నోలో ఈ స్టేడియం ఏర్పాటైందని, అలాంటిది ఈ స్టేడియానికి వాజ్‌పేయి పేరు ఎలా పెడతారని ఎస్‌పీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. అయితే సీఎం యోగి మాత్రం స్టేడియం పేరు మార్పు నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. 1991 నుంచి 2009 మధ్య కాలంలో 5 సార్లు వరుసగా లక్నో ఎంపీగా సేవలు అందించినందుకే వాజ్‌పేయి పేరును ఈ స్టేడియానికి పెట్టడం జరిగిందన్నారు. వాజ్‌పేయి తన ప్రభుత్వ హయాంలో క్రీడలకు ఎంతగానో ప్రోత్సాహం అందించారని, ఆయన స్ఫూర్తితో దేశంలో ఉన్న అన్ని గ్రామాల్లో భారీ ఎత్తున విశాలమైన క్రీడా మైదానాలను నిర్మిస్తామని యోగి చెప్పారు. ఘజియాబాద్‌లో నిర్మింపబడుతున్న భారీ స్టేడియాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని యోగి తెలిపారు.