ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్లు

ముంబయి,నవంబర్‌6(జ‌నంసాక్షి): దేశీయ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. కొనుగోళ్ల అండతో నేటి ట్రేడింగ్‌ను సూచీలు ఉత్సాహంగానే ప్రారంభించాయి. అయితే కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు, బ్యాంకింగ్‌ రంగ షేర్లలో అమ్మకాలు సూచీలను ఒత్తిడిలోకి నెట్టేశాయి. ఫలితంగా ఆరంభ లాభాల్లో కొంత కోల్పోవాల్సి వచ్చింది. దీంతో నేటి సెషన్‌లో సూచీలు స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. ఈ ఉదయం సెన్సెక్స్‌ 100 పాయింట్ల లాభంతో ఉత్సాహంగా ప్రారంభమైంది. ఒక దశలో 200 పాయింట్లకు పైగా ఎగబాకింది. అయితే ఎస్‌బీఐ సహా బ్యాంకింగ్‌ రంగాల షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాలతో సూచీల జోరుకు కళ్లెం పడింది. దీంతో ఆరంభ లాభాలను కోల్పోతూ వచ్చిన సూచీ చివరకు 41 పాయింట్ల స్వల్ప లాభంతో 34,992 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ కూడా అత్యల్పంగా 6 పాయింట్ల లాభంతో 10,530 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 73.04గా కొనసాగుతోంది.

ఎన్‌ఎస్‌ఈలో జీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, యస్‌ బ్యాంక్‌, టీసీఎస్‌, సన్‌ఫార్మా, టాటామోటార్స్‌ షేర్లు లాభపడగా.. సిఎ/-లా, ఎస్‌బీఐ, హిందుస్థాన్‌ పెట్రోలియం, యాక్సిస్‌ బ్యాంక్‌, భారత్‌ పెట్రోలియం షేర్లు నష్టపోయాయి.