బండి సంజయ్‌ కి రెండో రోజు నిరసన సెగ

రైతుల కోసం ఎందాకైనా పోరాడుతామన్న బండి

సూర్యాపేట,నవంబర్‌16(జనం సాక్షి ):రైతుల కోసం ఎంతవరకైనా పోరాడతామని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. రైతుల సమస్యలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంటే దాడులు చేయడమేంటని ప్రశ్నించారు. రైతుల కోసం దాడులు సహిస్తామని, వారికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఫామ్‌ హౌస్‌కు పరిమితమైన సీఎం కేసీఆర్‌కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షిణించాయని విమర్శించారు. సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పరస్పరం నినాదాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా తనిఖీలు చేపట్టిన పోలీసులకు ఓ ఆటోలో ఉన్న కర్రలను స్వాధీనం చేసుకున్నారు. కొర్లపహా టోల్‌ ప్లాజా వద్ద పోలీసులు మోహరించారు. హైదరాబాద్‌ నుంచి సూర్యాపేట వైపు బీజేపీ నాయకులు వెళ్లకుండా తనిఖీలు చేశారు. 40 మందిని అదుపులోకి తీసుకున్నారు. సూర్యపేట జిల్లాలో బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ కు అడుగడుగునా నిరసన సెగలు తగిలింది. చివ్వెంల మండలానికి బిజెపి పరామర్శ యాత్ర చేసేందుకు చేరుకున్న బండి సంజయ్‌ను టిఆర్‌ఎస్‌ నేతలు అడ్డుకున్నారు. న్న నల్గొండ, మిర్యాలగూడలో రైతులపై రాళ్లదాడి చేసినందుకు క్షమాపణ చెప్పి వెళ్లిపోవాలని డిమాండ్‌ చేశారు. యాసంగి సీజన్‌ లో ధాన్యం కోనుగొలుపై కేంద్రం వైఖరేంటని రైతులు నిలదిశారు. నల్లజెండాలు, చెప్పులతో నిరసన తెలుపుతూ.. గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేస్తూ.. ధాన్యం కోనుగోలు కేంద్రంలోకి రావదంటూ బైటాయించారు.