బంద్‌రోజే 90కి పెరిగిన పెట్రోల్ ధ‌ర‌

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నప్పటికీ… పెట్రోల్, డీజిల్ ధరలకు మాత్రం కళ్లెం పడలేదు. ఇవాళ భారత్ బంద్ జరుగుతుండగానే పెట్రోల్ ధర 23 పైసలు, డీజిల్ ధర 22 పైసల మేర పెరగింది. దీంతో ప్రస్తుతం దేశ రాజధానిలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రూ.80.73, రూ. 72.83కి చేరాయి. మరోవైపు దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో ఈ ధరలు రూ.88.12, రూ.77.32గా ఉన్నాయి.
కాగా ఇంధన ధరల పెరుగుదలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీస్తూ… ఇవాళ కాంగ్రెస్ సారథ్యంలో ప్రతిపక్షాలకు చెందిన మొత్తం 21 పార్టీలు భారత్ బంద్ చేపట్టాయి. ఒడిశాలోని సాంబాల్‌పూర్ వద్ద ప్రతిపక్షాలకు చెందిన కార్యకర్తలు ఓ రైలును నిలిపివేశారు. మరోవైపు భారత్ బంద్ సందర్భంగా ఈశాన్య కర్ణాటక ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఇంధన ధరలపై తీవ్ర నిరసన వెల్లువెత్తుతోంది.