బడుగులకు అవమానాలు మిగిలాయి

హక్కుల కోసం పోరాడితే వ్యతిరేక ముద్రా: సిపిఐ

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌14(జ‌నం సాక్షి): తెలంగాణ ఏర్పడితే బతుకులు బాగు పడుతాయని భావించిన బడుగు బలహీనవర్గాలకు పరాభవాలు తప్పడం లేదని సిపిఐ నేత, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్‌ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగి ఉండవని ఆయన అన్నారు. రాష్ట్రంలో జాగీర్ల పాలనసాగుతోందని అన్నారరు. ప్రజా సమస్యల పరిష్కారానికి గొంతెత్తుతున్న ప్రతిపక్షాల గొంతు నొక్కడం ప్రజాస్వామ్యానికి విఘాతమని సీపీఐ నేత అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన వారిపై కేసులు నమోదు చేస్తూ, దాడులకు పాల్పడటం, తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారు మంత్రి పదవుల్లో కొనసాగుతున్నారని, ఇందుకేనా ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నది అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హావిూలనే అమలు చేయాలని ప్రతిపక్షాలు అడుగుతున్నాయని, ప్రాజెక్టులను ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని ప్రభుత్వం చేస్తున్న గోబెల్స్‌ ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఏ ప్రతిపక్ష పార్టీ కూడా అభివృద్ధిని అడ్డుకోవడం లేదని స్పష్టం చేశారు. ప్రచారార్భాటాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. పోడు వ్యవసాయం చేస్తూ అటవీ భూములపై హక్కులను కల్పించాలని సిపిఐ ఎప్పటి నుంచో కోరుతోందన్నారు. అటవీ హక్కుల పత్రాలను రికార్డుల్లో నమోదు చేసి ప్రభుత్వ రాయితీలు అందేలా చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఎకరానికి రూ.4 వేలు పథకంలో రైతులు పేర్లును నమోదు చేయలేదన్నారు. అనావృష్టి, అతివృష్టిలతో పంటలను నష్టపోతే నష్టపరిహారం సైతం ఇప్పటికీ అందలేదన్నారు.