బడుల హేతుబద్ధీకరణకు కసరత్తు 

త్వరలో ఉపాధ్యాయ సంఘాలతో చర్చ?
నిజామాబాద్‌,ఏప్రిల్‌24(జ‌నంసాక్షి): ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ బడుల బలోపేతానికి చేపడుతున్న చర్యలు అంతగా ఫలించడం లేదు. ఏటా కోట్లాది రూపాయల నిధులు వెచ్చిస్తున్నా ఏటా క్రమంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. గత మూడేళ్లలో 25వేల మంది విద్యార్థులు ప్రైవేటు బాట పట్టారు. అన్ని రకాలుగా నాణ్యమైన ఉపాధ్యాయులు, వసతులు ఉన్నప్పటికీ విద్యార్థుల తల్లిదండ్రుల్లో మార్పు రాకపోవడం గమనార్హం. ప్రభుత్వ పాఠశాలల హేతుబద్ధీకరణ దిశగా తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. విద్యార్థులు తక్కువగా ఉండి ఉపాధ్యాయులు తక్కువ ఉన్న చోట విలీనం చేయాలనే కసరత్తు జరుగుతోంది. విద్యా నాణ్యత ప్రమాణాలు పెంచే దిశగా యంత్రాంగం అడుగులు వేస్తోంది. హేతుబద్ధీకరణ ద్వారా రెండు మూడు పాఠశాలలున్న చోట చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు. సవిూప పాఠశాలల విలీనం ద్వారా ఒక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. తద్వారా తరగతి గదికి ఒక బోధకుడిని నియమిస్తే ఉపాధ్యాయుల సంఖ్య పెరగనుంది. అయితే హేతుబద్దీకరణ ద్వారా గతంలో నిర్ధేశిరచిన ఉపాధ్యాయ పోస్టుల విషయంలో సందిగ్ధం నెలకొంది. వాసాలకు బడి కిలోవిూటరు దూరం మించితే విద్యార్థులు ఉచితంగా రవాణా సౌకర్యం కల్పించేందుకు అవకాశాన్ని పరిశీలిస్తోంది. ఉచితంగా రవాణా సౌకర్యంతో ప్రభుత్వ బడులకు వచ్చే విద్యార్థులను ఆకర్షించాలని భావిస్తోంది. ఈ విషయాన్ని త్వరలో ఉపాధ్యాయ సంఘాల నేతలతో చర్చించనుంది.  20లోపు విద్యార్థులున్న  పాఠశాలలు చాలానే  ఉన్నాయి.  ఈ పాఠశాలల్లో ఒకరు లేదా ఇద్దరు ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. ఏళ్ల నాటి నుంచి ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల సంఖ్య క్రమేపీ తగ్గుతూ వస్తోంది. ఈ తరుణంలో ప్రభుత్వ బడుల నిర్వహణ మనుగడకే సవాలుగా మారింది. నాణ్యమైన చదువులు ప్రభుత్వ విద్యాలయాల్లో అందుబాటులో ఉన్నా విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేటు వైపే మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా ప్రభుత్వ బడుల్లో సంఖ్య తగ్గి పాఠశాలల ఉనికికే ప్రమాదంగా మారింది.విలీనం చేయాలనే ప్రతిపాదన ప్రభుత్వం హేతుబద్ధీకరణ ద్వారా తరగతి గదికో ఉపాధ్యాయుడిని నియమించాలనే ఆలోచనతో ఉంది. సవిూప పాఠశాలల్లో విద్యార్థులు లేకుంటే ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్థులను విలీనం చేయాలనే ప్రతిపాదన ఉంది. కొన్ని గ్రామాల్లో 2-4 పాఠశాలలున్న చోట 20-40 మంది విద్యార్థులున్నారు. జుక్కల్‌, మద్నూర్‌, బాన్సువాడ, కామారెడ్డి తదితర ప్రాంతాల్లో తక్కు విద్యార్థులున్న పాఠశాలలను విలీనం చేసేవి 30 వరకు ఉంటాయి. హేతుబద్ధీకరణ చేసి 100 మందికి ఒక పాఠశాలను ఉంచితే సత్ఫలితాలను ఆశించే వీలుంటుందని భావిస్తున్నారు. అయితే తరగతి గదికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలంటే ప్రస్తుతం ఉన్న వారు సరిపోరు. కొత్తగా ఉపాధ్యాయ నియమాకాలు చేపడితే సమస్యను అధిగమించే అవకాశం ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.