బయ్యారం ఉక్కు విభజన చట్టంలోనే ఉంది

అభివృద్దిలో దూసుకుపసోతున్న తెలంగాణ :ఎంపి

ఖమ్మం,జూన్‌19(జ‌నం సాక్షి): విభజన చట్టంలో బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీని నిర్మించాలని నిర్ధిష్టంగా ఉన్నా కేంద్రం సహకరించడం లేదని ఎంపి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. బయ్యారంలో ఉక్కుందని, 150 కిలో విూటర్ల దూరంలో ఛత్తీస్‌ఘడ్‌లో ఖనిజం దొరుకుతుందని, అయినా కేంద్రం విూనమేషాలు లెక్కిందన్నారు. ఈ 70 ఏళ్లలో జరగని అభివృద్ధి మూడేళ్లలోనే సిఎం కెసిఆర్‌ చేసి చూపారిన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ముఖాల్లో నవ్వు చూడాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ దేశంలో ఏ రాష్ట్రంలో అమలు పర్చని సంక్షేమ పథకాలను తెలంగాణాలో అమలు పరుస్తున్నారని అన్నారు.తెలంగాణ ఉద్యమం ఏ ప్రాతిపదికన జరిగిందో ఆ లక్ష్యాలను నెరవేర్చే దిశగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. నీళ్లు, నిధులు, నియామాకాలలో స్వల్ప కాలంలోనే అన్ని రంగాలలో అభివృద్ధిలో ముందున్నామన్నారు. తెలంగాణాలో జరిగింది అధికార మార్పిడి కాదని, బాలారిష్టాలు దాటి ఎన్నో రకాల అవస్థలను ఎదుర్కొంటున్నామన్నారు. సంక్షేమం అంటే తెలంగాణాలో మాదిరిగా ఉండాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. ఖమ్మం జిల్లాలో ఐటి పరిశ్రమకు పునాది పడడంతో ఇక్కడి నిరుద్యోగులకు అవకాశాలు వస్తాయమని అన్నారు. రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి పట్టణాలకు కూడా ఐటీ పరిశ్రమను తీసుకొస్తున్నామన్నారు. ఏడాది కాలంలో ఖమ్మంలో 2 వేల ఐటీ ఉద్యోగాలు వస్తాయన్నారు. ఇప్పటి వరకు ఐటీ అంటే హైదరాబాద్‌కే పరిమితమైందని ఖమ్మంలో కూడా ఏడు కంపెనీలకు ల్యాండ్‌ కేటాయిస్తూ ఆర్డర్లు ఇవ్వడం జరిగిందన్నారు. భక్తరామదాసు ప్రాజెక్టును 9 నెలల్లోనే పూర్తి చేసి కరువు ప్రాంతాలైన కూసుమంచి, తిరుమలాయపాలెం ప్రజలకు సాగునీరు అందించామని ఎంపి పొంగులేటి అన్నారు. సీతారామ, పాలమూరు ఎత్తిపోతల పథకం, మల్లన్నసాగర్‌, కాళేశ్వరం ప్రాజెక్టుల ద్వారా గోదావరి, కృష్ణ జలాల్లో తెలంగాణ వాటా ప్రకారం రావాల్సిన 1200 టీఎంసీలలో ప్రతి నీటిబొట్టును సద్వినియోగం చేసుకుంటామని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పేరుతో ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఆర్డినెన్స్‌ ద్వారా బలవంతంగా లాక్కున్నారని, లోయర్‌ సీలేరు ప్రాజెక్టును ఏపీకే వదిలేశారని అన్నారు. అతిస్వల్ప కాలంలోనే అన్ని రంగాలలో దూసుకుపో యామన్నారు.