బలమైన అభ్యర్థులే కాంగ్రెస్‌కు కీలకం

 

ముందస్తు వ్యూహంపై నేతల మనోగతం

సమన్వయంతో ముందుకు వెళ్లాలని సందేశం

హైదరాబాద్‌,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): రానున్న ఎన్నికల్లో అధికార పీఠమే లక్ష్యంగా పార్టీ అభ్యర్థుల ఎంపిక జరగాలని కాంగ్రెస్‌ కార్యకర్తలు కోరుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో నాయకులకు, పార్టీ కార్యకర్తలకు వారుధులుగా పనిచేసే మండల, జిల్లా స్థాయి నాయకుల సమన్వయంపై దృష్టి సారించింది. సంప్రదాయ ఓటు బ్యాంకును కాపాడుకుంటూనే, ఇతర పార్టీల నుంచి అసంతృప్తులను తమవైపు తిప్పుకోవాలని కసరత్తు ప్రారంభించింది. పిసిసి చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి చేస్తున్న ప్రకటనల నేపథ్యంలో ఆందోళనలతో ప్రజలను ఆకట్టుకునే పనిలో పడ్డారు. రానున్న ఎన్నికల్లో సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాల్లో పార్టీ విజయం సాధించేలా… క్షేత్రస్థాయిలో బలమైన నాయకత్వాన్ని ఎంపిక చేయడానికి పార్టీ నేతలు యత్నిస్తున్నారు. కొత్త జిల్లాలకు పూర్తిస్థాయిలో అధ్యక్షులను నియమించలేదు. డీసీసీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న వారు వచ్చే ఎన్నికల్లోనూ

పోటీ చేయడానికి అర్హులేనని పార్టీ అధిష్ఠానం ప్రకటించడంతో ఆ పదవికి ఆశావహుల జాబితా ఎక్కువైంది. పార్టీ అధిష్ఠానం అందరినీ సమన్వయపరిచే నాయకుల కోసం వెతుకుతోంది. క్షేత్రస్థాయిలో బలమైన నాయకత్వం… అన్ని వర్గాలను కలుపుకుపోగల సమర్థత, జిల్లా రాజకీయాల్లో వర్గ విభేదాలను పక్కనబెట్టి అంగ, అర్థ బలాల్లో గట్టిగా ఉన్నవారినే పార్టీ అభ్యర్థులుగా ప్రకటించనున్నట్లు తెలిసింది. కార్యకర్తల్లో నైతికసైర్థ్యం నింపేలా నాయకత్వం పనిచేయాలని పార్టీ అధిష్ఠానం ఇటీవలే గట్టిగా హెచ్చరించింది. ఎన్నికలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోనే జరుగుతాయని ఇప్పటికే పార్టీ అధిష్ఠాన వర్గం సంకేతాలు ఇచ్చింది. దీంతో ఎట్టిపరిస్ధితుల్లోనూ కార్యకర్తల్లో చులకన కావొద్దని.. పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేయాలని నాయకులను ఆదేశించడంతో పాటు సంస్థాగతంగా బలోపేతమై కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపడానికి మరికొన్ని రోజుల్లో డీసీసీ అధ్యక్షులతో పాటు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను వడపోసి ప్రకటించేలా కార్యచరణను రూపొందించనుంది. అయితే పార్టీని ముందుండి నడిపించి తీసుకుని వెళ్లగలిగేలా సమర్థుల కోసం అన్వేషిస్తున్నారు. అలాగే జిల్లాలో ఎన్నికల కోసం అభ్యర్థుల ఎంపిక కత్తివిూద సాము లాంటిదే. వర్గవిభేదాలు పక్కన పెడితేనే అధికార పార్టీని ఢీకొనగలమని అంటున్నారు. గెలుపుగుర్రాలను గుర్తించి ముందుకు తీసుకుని వెళితే విజయం సాధ్యమని కార్యకర్తలు అంటున్నారు.