బాబు రాసిచ్చిన నివేదికను..  కమిటీ ఇచ్చినట్లుగా ఉంది

– తొక్కిసలాట ఫుటేజ్‌ను తొక్కేశారు
– సీఎం ఉన్నప్పుడే తొక్కిసలాట జరిగిందని ఎస్పీ నివేదిక కూడా ఇచ్చారు
– కమిషన్‌ సిఎం వెళ్లిన తరువాత తొక్కిసలాట జరిగిందని తెలిపింది
– సీఎంను కాపాడటానికే సోమయాజుల నివేదిక
– వైఎస్సార్‌సీపీ అధికారప్రతినిధి వాసిరెడ్డి పద్మ
హైదరాబాద్‌, సెప్టంబర్‌19(జ‌నంసాక్షి) : సీఎం చంద్రబాబు నాయుడు రాసిచ్చిన దానికి ప్రకారం జస్టిస్‌ సోమయాజుల కమిటీ నివేదికను తయారు చేసిచ్చినట్లుగా ఉందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. బుధవారం ఆమె పార్టీ కేంద్రకార్యాలయంలో విూడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఎవరినైనా మేనేజ్‌ చేయగలరని చెప్పడానికి సోమయాజుల కమిటీ నివేదికే నిదర్శనమన్నారు. తప్పంతా భక్తులదే.. మూడ నమ్మకంతో అంతమంది అక్కడికి వెళ్లటం వల్లే ప్రమాదం జరిగిందని చెప్పించడం సిగ్గుచేటని ఆగ్రహం వక్తం చేశారు. అసలు సోమయాజులు కమిటీ ఎందుకు వేశారని, ఏం చెప్పారని ప్రశ్నించారు. ఈ నివేదికను చంద్రబాబే రాసినట్టుందని, ఆయన రాసిన రిపోర్ట్‌పై సోమయాజులు సంతకం పెట్టినట్లుందన్నారు. ముఖ్యమంత్రి స్నానం చేసే వరకు ఎవరిని అనుమతించలేదని, తొక్కిసలాట జరుగుతున్న విషయం సీఎంకు చెప్పమని జిల్లా ఎస్పీ విూడియాకు చెప్పారని, సీఎం ఉన్నప్పుడే తొక్కిసలాట జరిగిందని ఎస్సీ నివేదిక కూడా ఇచ్చారని గుర్తు చేశారు. కానీ కమిషనేమో సీఎం వెళ్లిన తర్వాత జరిగిందని చెబుతోందన్నారు. పపుష్కరాల మరణాలకు చంద్రబాబే కారణమని ఆరోపించారు. లేని ముహూర్తం పెట్టి.. ప్రచార యావతో 30 మందిని పొట్టనబెట్టుకున్నారని మండిపడ్డారు. ఈ ప్రమాదంపై చంద్రబాబుకి కనీసం మానత్వం కూడా లేదని విమర్శించారు. సీఎం స్నానం చేసే దృశ్యం డాక్యుమెంటరీ కోసం డైరెక్టర్‌ బోయపాటి బృందంతో ఏర్పాట్లు చేశారన్నారు. కమిషన్‌ రిపోర్ట్‌లో ఉపయోగించిన భాష అభ్యంతరకరంగా ఉందని, ప్రజలకు ఇంగితం లేదని సోమయాజులు ఎలా అంటారని ప్రశ్నించారు. అలాంటి రాతలు రాయటానికి చేతులెలా వచ్చాయని మండిపడ్డారు.  ఈ నివేదికను వైసీపీ వ్యతిరేకిస్తుందని,  ఈ ఘటనపై తమ పోరాటం కోనసాగుతుందని స్పష్టం చేశారు. వంగవీటి రంగ విషయంపై విలేకరుల ప్రశ్నించగా.. వంగవీటి రంగ వైసీపీ పార్టీ నేత అని, ఆయనను మేం ఎలా వదులుకుంటామని ఎదురు ప్రశ్నించారు. వంగవీటి రంగాకు ఎలాంటి అన్యాయం జరగదని, రాధాకు పార్టీ కేటాయించిన సీట్‌లో గెలుపించుకొనే బాధ్యత వైసీపీదేనన్నారు. రంగ పార్టీ విజయం కోసం పనిచేస్తున్నారని, దానిలో ఎలాంటి మార్పు ఉండదని అన్నారు.