బాబ్లీ కేసులో..  రీకాల్‌ పిటీషన్‌కే బాబు మొగ్గు 


– 21న లాయర్‌ ద్వారా కోర్టులో రీకాల్‌ పిటీషన్‌ వేయించాలని నిర్ణయం
అమరావతి, సెప్టెంబర్‌19(జ‌నంసాక్షి) : బాబ్లీ కేసులో అరెస్ట్‌ వారెంట్‌పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 21న లాయర్‌ను ధర్మాబాద్‌ పంపి.. కోర్టులో రీకాల్‌ పిటిషన్‌ వేయాలని నిర్ణయించారు. కేసుకు సంబంధించిన చార్జ్‌షీట్‌, జారీ అయిన నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌తో
పాటూ మిగిలిన డాక్యుమెంట్లను తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి మంగళవారం ఏపీ పోలీసు ఉన్నతాధికారులు.. నాందేడ్‌ ఎస్పీతో కూడా ఫోన్‌లో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంలో అరెస్ట్‌ వారెంట్‌ అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. వారెంట్‌ తమకు అందలేదని.. కేసుకు సంబంధించిన పత్రాలు కూడా లేవని ఏపీ అధికారులు అక్కడి ఎస్పీ దృష్టికి తీసుకొచ్చారట. ఈ బాబ్లీ కేసు వ్యవహారంపై మంత్రులు, అధికారులతో రెండు రోజులుగా చంద్రబాబు చర్చించారు. వారెంట్‌పై ఎలా ముందుకెళదామని నేతల వద్ద ప్రస్తావించారు. న్యాయ వ్యవస్థను గౌరవించి.. కోర్టుకు వెళ్దామని బాబు అంటే.. ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించిన తర్వాత ఓ నిర్ణయం తీసుకుంటే మంచిదని కొందరు నేతలు అభిప్రాయపడ్డారట. రీ కాల్‌ పిటిషన్‌ వేస్తే కోర్టుకు వెళ్లే పని ఉండకపోవచ్చని.. ఆ దిశగా కూడా ఆలోచన చేయాలన్నారట. దీంతో రీకాల్‌ పిటిషన్‌ వైపే చంద్రబాబు మొగ్గు చూపారు.
బాబ్లీ కేసు విషయానికొస్తే..
2010లో మహారాష్ట్ర నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు, దానికి అనుబంధంగా ఉన్న ఎత్తపోతల పథకాలకు వ్యతిరేకంగా చంద్రబాబుతో పాటూ అప్పటి టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. ప్రాజెక్టు పరిశీలించేందుకు వెళ్లగా.. సరిహద్దులో మహారాష్ట్రలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నేతలు అక్కడే రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. తర్వాత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో లాఠీఛార్జ్‌ చేశారు. చంద్రబాబుతో సహా చంద్రబాబు సహా ఎమ్మెల్యేలను అరెస్ట్‌ చేసి స్థానికంగా ఉన్న ఓ కాలేజీలో ఉంచారు. తర్వాత బలవంతంగా విమానంలో హైదరాబాద్‌కు పంపారు. ఈ ఘటన తర్వాత విధి నిర్వహరణలో ఉన్న పోలీసులను అడ్డుకోవడం, అనుమతి లేకుండా వచ్చారని .. 144సెక్షన్‌ అమలులో ఉన్నా పట్టించుకోలేదంటూ చంద్రబాబుతో పాటూ ఎమ్మెల్యేలపై ధర్మాబాద్‌లో కేసు నమోదయ్యింది. నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ కూడా జారీకాగా.. అది పెండింగ్‌లో ఉంది. ఈ కేసుపై ధర్మాబాద్‌ కోర్టులో ఓ వ్యక్తి పిటిషన్‌ దాఖలు చేశాడు. నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ పెండింగ్‌లో ఉండటాన్ని ప్రశ్నించాడు. దీంతో ఈ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ పిటిషన్‌పై విచారణ జరగ్గా.. వారెంట్‌ను ఎందుకు అమలు చేయలేదని కోర్టు పోలీసుల్ని ప్రశ్నించింది. కోర్టు చంద్రబాబుతో పాటూ మరో 16మందికి నోటీసులు జారీ చేసింది. అరెస్ట్‌ వారెంట్‌ కూడా వచ్చింది. ఈ నెల 21న ధర్మాబాద్‌ కోర్టుకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.