బాసరలో వైభవంగా ప్రారంభమైన.. దసరా ఉత్సవాలు


– కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించిన ఆపద్ధర్మ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
– శైలపుత్రిగా దర్శనమిచ్చిన అమ్మవారు
నిర్మల్‌, అక్టోబర్‌10(జ‌నంసాక్షి) : దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రంగా విలసిల్లుతున్న నిర్మల్‌ జిల్లా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో బుధవారం దసరా ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయాన్ని విద్యుద్దీపాలతో సుందరంగా అలంకరించారు. వివిధ రకాల పూలతో తీర్చిదిద్దారు. బుధవారం వేకువజామున 4గంటలకు మంగళ వాయిద్య సేవ, సుప్రభాత సేవతో ఉత్సవాలు ప్రారంభించిన అర్చకులు.. అమ్మవారికి మహాభిషేకం, అలంకరణ, మంగళహారతి, నక్షత్ర పూజల నిర్వహించారు. తొమ్మిది రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో అమ్మవారి దర్శనానికి తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రద్దీకి అనుగుణంగా అక్షరాభాస్యం, కుంకుమార్చన మండపాలను సుందరంగా తీర్చిదిద్దారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జ్ఞాన సరస్వతి అమ్మవారు రోజుకో రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. బుధవారం శైలపుత్రిగా దర్శనమిస్తున్న అమ్మవారు… రెండోరోజు బ్రహ్మచారిణి, మూడోరోజు చంద్ర గంట, నాలుగో రోజు కుష్మాండ, ఐదోరోజు స్కందమాత, ఆరోరోజు కాత్యాయని, ఏడో రోజు కాలరాత్రి, ఎనిమిదో రోజు మహాగౌరి, తొమ్మిదో రోజు సిద్ధిదాత్రి దేవిగా దర్శమివ్వనున్నారు. 15వ తేదీ అమ్మవారి మూలనక్షత్రం కావున భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉందని.. దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. నవరాత్రుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్మల్‌ జిల్లా పోలీసులు యంత్రాంగం బందోబస్తు ఏర్పాటుచేసింది.