బిజెపికి బలాన్ని ఇచ్చిన కర్నాటక ఫలితాలు

ఇతర రాష్ట్రల్లో ప్రభావం చూపడం ఖాయం

మరింత కుంగిపోనున్నకాంగ్రెస్‌

న్యూఢిల్లీ,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): మహారాష్ట్ర పరిణామాల తరవాత, జార్ఖండ్‌ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు బిజెపికి పెద్ద బూస్ట్‌ ఇచ్చాయనే చెప్పాలి. అలాగే కర్నాకటలో సుస్థర బిజెపి ప్రభుత్వం ఏర్పడడానికి ఈ ఫలితాలు దోహదపడ్డాయి. మరో మూడున్నరేళ్లు ఇక ఎలాంటి అనుమానాలు లేకుండా ముఖ్యమంత్రి యెడియూరప్ప సిఎంగా కొనసాగనున్నారు. ఆయన కాకున్నా వేరెవరు సిఎంగా ఉన్నా ఇక కర్నాటకలో బిజెపి ఢోకాలేదు. ప్రధానంగా మహారాష్ట్రలో శిసేన జారుకున్నాక వచ్చిన ఫలితాలు కావడంతో బిజెపికి ఇమేజ్‌ పెరిగిందనే భావించాలి. విపక్షాల విమర్శలు, బలం లేదన్న ఆరోపణలతో ఇక అర్థంతరంగా కుర్చీ దిగాల్సిన అవసరం లేకపోగా, మూడున్నరేళ్ళూ బిజెపి అధికారంలో కొనసాగేందుకు ఉప ఎన్నికల ఫలితాలు దోహదపడ్డాయి. ఉప ఎన్నికలు జరిగిన 15అసెంబ్లీ స్థానాల్లో పన్నెండింటిని బీజేపీయే గెలుచుకోవడం, కాంగ్రెస్‌ రెండు స్థానాలైనా గెలుచుకుంటే, కుమారస్వామి పార్టీకి ఒక్కటీ దక్కకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తమపై రాహుల్‌గాంధీ ఎంతో నమ్మకం పెట్టుకున్నారనీ, తామూ శ్రమించినా ఫలితం దక్కలేదంటూ పీసీసీ అధ్యక్షపదవికి గుండూరావు, విపక్ష నేత స్థానానికి సిద్దరామయ్య రాజీనామాలు చేశారు. కాంగ్రెస్‌-జెడిఎస్‌ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలదోసి, బీజేపీని అధికారంలో కూచోబెట్టడానికి ఎంతగానో సహకరించిన ఈ ఎమ్మెల్యేలంతా మళ్లీ గెలిచారు. దీంతో వీరికి సహజంగానే మంచి మంత్రి పదవులు దక్కనున్నాయి. అసెంబ్లీలో బీజేపీకి ఇప్పుడు అవసరానికి మించి మరో ఐదుగురి బలం చేకూరింది. హైకోర్టు కేసు కారణంగా రెండుస్థానాలకు ఎన్నికలు జరగక పోవడంతో సభ మొత్తం బలం, మెజారిటీ హద్దు తక్కువగా ఉన్న విషయం తెలిసిందే. దీనికితోడు ఒక ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యే కూడా బీజేపీ పక్షానే ఉన్నారు. అధికారాన్ని హస్తగతం చేసుకున్న యెడ్యూరప్ప ఇప్పటివరకూ అత్తెసరు మెజారిటీతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 104స్థానాలు సంపాదించిన యెడియూరప్ప సంఖ్యాబలం లేకున్నా, ఎదుటివారికి వల విసరగలనన్న నమ్మకంతో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధపడి, చివరకు సాధ్యం కాక బలపరీక్షకు ముందు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌-జెడీఎస్‌ కూటమి తన 13నెలల పాలననూ కూల్చడంలో ఈ ఎమ్మెల్యేలు ప్రధాన పాత్ర పోషించారు. వీరంతా బీజేపీకి సహకరించినప్పటికీ, స్పీకర్‌ అనర్హత వేటుతో పరిణామాలు మారిపోయాయి. సుప్రీంకోర్టు ఈ ఎమ్మెల్యేల అనర్హతను ఎత్తిపడుతూనే, ఎన్నికల్లో పోటీకి వీలుకల్పించింది. ఉపఎన్నికల ప్రచారంలో కేంద్రపెద్దలెవ్వరూ పాల్గొనకపోవడం, యెడియూరప్పే సమస్తమూ చక్కబెట్టడం గమనించాలి. ఈ ఎన్నికల్లో బీజేపీ కులసవిూకరణాలను సైతం అధిగమించి రాష్ట్రంలోని కొత్త ప్రాంతాలకు విస్తరించింది. ప్రాంతీయాధినేతలను చక్రం తిప్పనివ్వని బీజేపీ అధిష్ఠానం ఇకపై యెడ్డీ విషయంలో కాస్తంత భిన్నంగా వ్యవహరించక తప్పదు. ఎన్నికలు జరిగిన ప్రతిసారీ రాజకీయ సంక్షోభంలో కూరుకుపోతున్న కాంగ్రెస్‌కు సోమవారం వెలువడిన కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాల్లోనూ అదే పునరావృతం అయింది. అభ్యర్థుల ఎంపికనూ, ప్రచార బాధ్యతల్ని తన భుజస్కంధాలపై వేసుకున్న ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఉప ఎన్నికలు రాజకీయంగా ఆయన స్థానాన్ని సుస్థిరం చేశాయి. బీజేపీకి ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకమైనవి. మహారాష్ట్రలో ఊహించనివిధంగా కూటమి భాగస్వామి శివసేన విప క్షాలతో చేతులు కలిపి తమకు అధికారం దక్కకుండా చేసింది. పైగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న జార్ఖండ్‌లో ఇంకా మూడు దశలు పూర్తి కావలసి ఉంది. పైగా జేడీఎస్‌కు కంచుకోట అయిన ఓల్డ్‌ మైసూరు ప్రాంతంలోని మాండ్యా జిల్లాలో తొలిసారి బీజేపీ విజ యకేతనం ఎగరేసింది. అక్కడ కృష్ణరాజపేటె స్థానం తన ఖాతాలో వేసుకుంది. జేడీఎస్‌కు దన్నుగా ఉండే వొక్కళిగ జనాభా అధికంగా ఉన్న స్థానమిది. జనమంతా ఫిరాయింపు దార్లకు గట్టిగా బుద్ధి చెబుతారని భావించాయి. కేవలం బీజేపీని అధికారానికి దూరంగా ఉంచడం కోసం కలవడం తప్ప రాజకీయంగా ఆ రెండు పార్టీలూ ఒక ఉమ్మడి ఎజెండా రూపొందించుకోలేక పోయాయి. వరస వివాదాల్లో ఆ పార్టీలు తలమునకలై ఉండగా ఉపాధి లేమి, కరువుకాటకాలు రాష్టాన్న్రి పీల్చిపిప్పి చేశాయి. వీటన్నిటినీ ప్రజలు మరిచిపోలేదు. కనుకనే ఫిరాయింపుదార్ల అనైతిక రాజకీయాల గురించి ఎంత ప్రచారం చేసినా వారు పట్టించుకోలేదు. బీజేపీ ప్రచారం చేసిన సుస్థిర పాలన, అభివృద్ధికే వారు ఓటేశారు. ఈ ఫలితాలతో దేశంలో కూడా పార్టీ ప్రతిష్టను యడియూరప్ప పెంచగలిగారు. ఈ ఉప ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ను మరింత కుంగదీసే ప్రమాదం ఉంది. ఆ పార్టీ జాతీయ నాయకత్వం నిస్తేజంగా ఉండటం, రాష్ట్రంలో పార్టీ సారథులు రాజీనామాలు చేయడం నైతికంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలను కుంగదీస్తుంది. ఇప్పుడు సుస్థిర మెజారిటీ లభించింది గనుక బీజేపీ ప్రభుత్వం ఇక పాలనపై దృష్టి పెట్టనుంది.