బిజెపిలో చేరిన మోత్కుపల్లి

తెలంగాణలో బిజెపి బలోపేతం అవుతుందన్న లక్ష్మణ్‌
న్యూఢిల్లీ,జనవరి7(జనంసాక్షి): మాజీ మంత్రి, సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సింహులు భాజపాలో చేరారు. దిల్లీలో ఆ పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కమలం తీర్థం పుచ్చుకున్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్‌, ఎంపీలు సుజనా చౌదరి, గరికపాటి మోహన్‌రావుతో కలిసి నడ్డాతో ఆయన భేటీ అయ్యారు. మోత్కుపల్లికి నడ్డా భాజపా కండువా కప్పి సభ్యత్వ రశీదు అందజేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌ విూడియాతో మాట్లాడుతూ మోత్కుపల్లి రాక తెలంగాణలో భాజపా బలోపేతానికి తోడ్పడుతుందన్నారు. రాష్ట్రంలో తమ పార్టీ ప్రత్యామ్నాయ శక్తిగా మారుతోందని చెప్పారు. తెలంగాణలో ప్రఖ్యాతిగాంచిన సమ్మక్క-సారక్క జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరామని తెలిపారు. ఈ అంశంపై పలువురు కేంద్రమంత్రులను కలిశామని చెప్పారు. బీజేపీలో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు మోత్కుపల్లి ప్రధాని మోడీ, అమిత్‌ షా నేతృత్వంలో దేశం అభివృద్ధి చెందుతున్నదని, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే బీజేపీలో చేరాన న్నారు. రాష్ట్రంలో పార్టీలో ఒక కార్యకర్తలాగా పని చేసి, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు.  రాష్ట్ర సీఎం కేసీఆర్‌ గురించి మాట్లాడుతూ.. ఆయన దళిత వ్యతిరేకి అన్నారు. రాష్ట్రంలో కుటుంబపాలన , ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్నారన్నారు. ఎలక్షన్స్‌ ముందు కొత్త కొత్త పథకాలు తీసుకవస్తారు.. కానీ అవి సరిగ్గా అమల్లోకే రావన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి తప్పకుండా వస్తుందని, కేసీఆర్‌ ని గద్దె దించడం బీజేపీతోనే సాధ్యమని మోత్కుపల్లి అన్నారు.