బిజెపిలో చేరిన స్వామి పరిపూర్ణానంద


కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అమిత్‌షా
బిజెపి కోసం త్రికరణ శుద్దిగా పనిచేస్తానన్న స్వావిూజీ
న్యూఢిల్లీ,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): అంతా ఊహించినట్లుగానే శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద భాజపాలో చేరారు. గతంలో ఢిల్లీ వెళ్ళి మంతనాలు జరిపిన స్వావిూజీ శుక్రవారం ఉదయం దిల్లీకి వెళ్లి భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌లతో భేటీ అనంతరం రాజకీయ తీర్థం పుచ్చుకున్నారు. తమ పార్టీలోకి వచ్చిన పరిపూర్ణానందకు అమిత్‌ షా తన నివాసంలోనే పార్టీ కండువా కప్పి
సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయనకు ప్రాథమిక సభ్యత్వ రసీదును అందజేశారు. ఈ సందర్భంగా పరిపూర్ణానంద మాట్లాడుతూ.. మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధి చెందుతోందన్నారు. భాజపా సిద్దాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని చెప్పారు. ఏదీ ఆశించి తాను భాజపాలో చేరడంలేదని స్పష్టంచేశారు. ఆధ్యాత్మిక మార్గంలో ఎంత త్రికరణశుద్ధిగా పనిచేశానో… బీజేపీ కోసం కూడా అంతే స్థాయిలో పని చేస్తానన్నారు. తనకు ముందు, వెనకా ఎవరూ లేరన్నారు. దేశంలో ఎక్కడ అవసరమైతే అక్కడ పని చేయడానికి తాను సిద్ధమని… అమిత్‌ షా నేతృత్వంలో, మార్గదర్శకత్వంలో 24 గంటలు పని చేస్తానని వాగ్దానం చేశారు. తెలుగు ప్రజలు తనకు ఎంతో ఇచ్చారన్నారు. బీజేపీ కుటుంబంలో తాను కూడా భాగమయ్యానని తెలిపారు. దేశం కోసం, ధర్మం కోసం బీజేపీ పని చేస్తోందని పరిపూర్ణానంద అన్నారు.
తొమ్మిది రోజులు పూర్తి నిరాహారంగా ఉండి ఆత్మపరిశీలన చేసుకున్నానని ఈ సందర్బంగా స్వామి ప్రకటించారు.  తాను రాజకీయాలకు తగుతానా? ఇమడగలనా? పనిచేయయగలనా?.. ఇలా అన్ని రకాలుగా ఆలోచించుకున్నాకే భాజపాలో చేరానని అన్నారు.  దీక్షకు విజయ దశమితో పది రోజులు పూర్తయ్యాయి. నిన్ననే భోజనం తీసుకున్నా. దేశం కోసం, ధర్మం కోసం ఏ సూత్రాలను, సిద్దాంతాలను ఆరెస్సెస్‌ కొనసాగిస్తూ వచ్చిందో వాటిని రాజకీయ కోణంలో సమాజానికి మరింత చేరువ చేసే దిశగా భాజపా కృషిచేస్తోందన్నారు. అన్నింటికి మించి  సబ్‌కా సాత్‌ – సబ్‌కా వికాస్‌ నినాదంతో బిజెపి ముందుకెళ్తోంది. దేశ ప్రజలందరి అభివృద్ధిని కోరుకునే సూత్రమిది. కొత్తగా భాజపా ప్రవేశపెట్టింది కాదు. హిందూ సంస్కృతిలోఉన్నదే ఈ నినాదం. రాబోయే రోజుల్లో 29 రాష్ట్రాల్లో కమలాన్ని వికసింపజేసే విధంగా ఏక్‌ భారత్‌-శ్రేష్ఠ్‌ భారత్‌ అనే ప్రధాని మోదీ నినాదాన్ని ప్రతిఫలించే దిశగా నిబద్ధతతో పనిచేస్తోన్న భాజపా ఈ దేశానికి చాలా అవసరం అన్నారు.  భాజపా ఓ సైన్యం. కార్యకర్తలంతా సైనికులు. నేటి సమాజానికి ఆధ్యాత్మికత ఎంత అవసరమో.. సంస్కృతిని కాపాడే మరిన్ని అంశాలు చాలా ఉన్నాయి. వాటన్నింటినీ ఎలా పరిరక్షించవచ్చో ఆలోచించి.. రాంమాధవ్‌తో గతంలోనే చర్చించాను. అనతరం అమిత్‌ షాతోనూ 45 నిమిషాల పాటు చర్చించా. ధర్మాన్ని నిలుపుకోకపోతే దేశానికి ఉనికి లేదు. ఈ దేశ ఉనికే ధర్మం. దాన్ని నిలబెట్టుకోవాలనేది మహత్తరమైన ఆలోచన అని గతంలో జరిగిన భేటీలో అమిత్‌ షా నాతో అన్నారు. తొమ్మిది రోజుల దీక్ష తీసుకొని విజయదశమి నాడు వస్తానని ఆయనతో చెప్పాను. పూర్తిగా ఆత్మపరిశీలన చేసుకున్నాకే ఈ రోజు భాజపాలో చేరానని వివరించారు.  మోదీ, అమిత్‌షా, రామ్‌మాధవ్‌ మార్గదర్శకత్వంలోనే పనిచేస్తాను. వారేం చేయమన్నా.. తెలుగు రాష్ట్రాలకే కాదు.. దేశంలో ఏమూలకు పంపినా చిత్త శుద్ధితో పనిచేస్తానని అన్నారు.  రోజుకు 17గంటల పాటు పనిచేయగలనని మాట ఇస్తున్నాను. అమిత్‌షా, రామ్‌మాధవ్‌ అనుభవాలను కూడగట్టుకొని దేశానికి, ధర్మ పరిరక్షణకు నా ఊపిరి ఉన్నంత వరకు పనిచేస్తాను. తెలుగు రాష్ట్రాల ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకున్నారు. మా గురువు నాకు పరిపూర్ణానంద స్వామి అని పేరుపెడితే తెలుగు ప్రజలు నాకు పరిపూర్ణత ఇచ్చారు. వారిచ్చిన స్థానం పదవి కంటే గొప్పది. ఆ స్థానం మహత్తరమైన దానికి ఉపయోగపడాలి. ప్రజల కోరికలను నెరవేరుస్తా. నా భగవద్గీత ఆపను. నా సాధన ఆపుకోను. ప్రజాక్షేత్రంలో ఉన్నాను గనక సాధనను మరింత కఠినతరం చేసుకోవాలి. నాపై ఇంకా రెట్టింపు బాధ్యత పడింది. ఈ రాజకీయ ఆటను సక్రమంగా ఆడతానుని పరిపూర్ణానంద అన్నారు.