బిజెపి ఖాతాలో చేరిన కర్నాటక —————–మంగళవారం 15-5-2018

భారతీయ జనతా పార్టీ ఖాతాలో మరో రాష్ట్రం చేరింది. ఇప్పటికే వరుస విజయాలతో దూసుకుపోతున్న బిజెపికి కర్నాటక విజయంతో తన విజయపరంపరను కొనసాగించింది. దేశ రాజకీయాల్లో కీలక మలుపు తిప్పుతుందని భావించిన ఈ రాష్ట్రంపై  కాంగ్రెస్‌ బాగా ఆశలు పెట్టుకుంది. తదుపరి ప్రధాని అవుతానని ప్రకటించిడం ద్వారా రాహుల్‌ అభాసుపాలయ్యారనే చెప్పాలి. ముఖ్యంగా దక్షిణాదికి ముఖ్యమైన రాష్ట్రంగా ఉన్న కర్నాటకలో మళ్లీ అధికారంలోకి రావడంతో దక్షిణాదిలో పాగా వేయాలన్న బిజెపి ప్లాన్‌ విజయం అయ్యింది. ఈ ఫలితాల్లో ప్రధానంగా మోడీ, అమిత్‌షా ద్వయం, యెడ్యూరప్పల వ్యూహం ఫలించందని చెప్పాలి. ఈ ఎన్నికల ఫలితాలు తప్పకుండా రానున్న రాష్ట్రాల ఎన్నికలపై ఉంటుందని బాగా ప్రచారం జరిగింది. ఈ దశలో ఎన్నికల ప్రచారం ¬రా¬రీగా సాగింది. బిజెపి ద్వయం వ్యూహాత్మకంగా సాగాయి. రాహుల్‌,సోనియాగాంధీ కూడా ప్రచారం చేశారు. ఎన్నికల ఫలితాలు ముగిసిన తరవాత హంగ్‌ తప్పదని ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలు ఊదరగొట్టాయి. ‘హంగ్‌’ అసెంబ్లీ అంటూ ఊదరగొట్టేలా మెజారిటీ పోల్‌ సర్వేలు కుండబద్ధలు కొట్టినా ఆ అంచనాలు తలకిందులయ్యేలా కర్ణాటక అసెంబ్లీ ఫలితాలు వెలువడ్డాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదనే బలమైన అంచనాలను బీజేపీ తిరగరాస్తూ… మెజారిటీ దిశగా దూసుకుని పోయింది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అసవరమైన మెజార్టీ సాధించింది.  దీంతో సీన్‌ మారిపోయింది.
ఒకవేళ బిజెపి పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకుంటే మూడో స్థానంలో కొనసాగుతున్న జేడీఎస్‌ ‘కింగ్‌ మేకర్‌’ పాత్ర పోషించాలని చూసింది.  అలా జరిగితే అది జేడీఎస్‌కూ కలిసొచ్చే అంశమే. తాము మద్దతిచ్చే పార్టీతోనే అధికారం పంచుకునే అవకాశం ఉంటుంది.  స్పష్టమైన ఆధిక్యత రావడంతో ఇతర పార్టీలపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా ఓటర్లు స్పష్టమైన తీర్పును ఇచ్చారు. పొత్తు అవసరమే లేదని తేల్చారు. కర్నాటకలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికలలో డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేసారు.  విజయం కోసం విచ్చలవిడిగా ఖర్చు చేయడం కర్నాటకలో కానవచ్చింది. కాంగ్రెస్‌ పార్టీ పాలనలో మంత్రులు, తదితరులు మాత్రమే అవినీతికి పాల్పడటాన్ని చూశాం. రాష్ట్రానికి ఇచ్చిన హావిూలు అమలు చేయకపోగా, ముఖ్యమంత్రి సిద్దరామయ్య మొత్తంగా ఎన్నికల వ్యవహారాలను తన భుజాలపై వేసుకున్నారు. ఆయన తనను తాను ఎక్కువగా ఊహించుకుని ప్రధాని మోడీతో ఢీకొనే నేతగా పోల్చుకున్నారు. ఈ కారణంగానే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది.
అలాగే ప్రజలకు కొన్ని కామన్‌ సమస్యుల ఉంటాయి. అవి పరిష్కారం అయ్యాయా లేదా అన్నదే గీటురాయి. వాటిపట్ల ప్రజలు సంతృప్తిగా ఉంటే ప్రజారంజక పాలన సాగుతున్నట్లే. అవి రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు లేదా కేంద్ర ప్రభుత్వం కావచ్చు. కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు విజయానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని పార్టీ నేతలకు భాజపా అధ్యక్షుడు అమిత్‌షా గతంలో చేసిన సూచన మేరకు కర్నాటకలో అమలు చేసేలా కృషి చేశారు.  2014 సాధారణ ఎన్నికల ఫలితాలతోనే సంతృప్తి పడి సరిపెట్టుకోవద్దని, 2019లో బాగా రాణించేందుకు రంగాన్ని సిద్ధం చేయాలని గతంలోనే స్పష్టం చేశారు. పార్టీ బలంగా లేని  రాష్ట్రాల్లో  బలోపేతానికి కృషి చేయాలని ప్రణాళిక వేసుకున్నారు. నిజానికి ప్రభుత్వం విజయాలు సాధిస్తే అవి ప్రజలకు చేరుతాయి. వాటికి మళ్లీ ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవి ప్రజలకు ఏ రకంగా ప్రయోజనకరమో అనుభవంలో ఉంటుంది కనుక కర్నాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యం ఇప్పుడు కొట్టొచ్చినట్లుగా కనిపించింది. ప్రజలు కాంగ్రెస్‌ పాలనపై సంతృప్తిగా ఉండివుంటే బిజెపికి విజయం దక్కేది కాదు. దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతుండడంతో
ఏ జాతీయ పార్టీ అయినా సొంతంగా అధికారంలోకి వచ్చే పరిస్థితులు లేవని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. కానీ వారందరి అంచనాలను పటాపంచలుచేస్తూ నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి  ఒంటరిగా అధికారంలోకి వచ్చింది. అయినా మిత్ర పక్షాలతోనే కలసి ఎన్డీఏ సర్కారును ఏర్పాటు చేసింది. సిద్దాంతాల ప్రాతిపాదికన రాజకీయాలు చేసే పార్టీగా బిజెపికి జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. కర్నాటకలో కూడా భారతీయ జనతా పార్టీకి బలమైన నాయకులు ఉన్నారు. జాతీయ స్థాయి నేతలు ఆ జిల్లాలో ఉన్నారు.  ప్రజాస్వామ్యంలో ఎన్నికలు, ప్రభుత్వ ఏర్పాటు సర్వసాధారణం అయినా ప్రజలంతా తమకు ఏదొ బాగు జరగాలన్న లక్ష్యంతో ఓటేస్తారు. ఎవరో ఒకరిని గద్దెనెక్కించేందుకు కాదని గుర్తు చేసుకోవాలి. ఉత్తరాదిలో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ప్రకటించిన వేళ ప్రజలు బిజెపిని నమ్మి ఓటేశారని స్పష్టంగా తెలిసింది. ఇప్పుడు కర్నాటకలో కూడా ప్రజలు ఎన్నో ఆశలతో బిజెపికి అందలం ఎక్కించారు. కింది స్థాయిలో హావిూలు నెరవేరి ప్రజలు బాగుపడుతున్నారా లేదా అన్నది కర్నాటకలో కాంగ్రెస్‌ పట్టించుకోలేదు. ప్రధాని నరేంద్రమోదీ నవభారతాన్ని ఆవిష్కరిస్తామని, పేద, మధ్య తరగతి ప్రజలకు మేలు చేస్తామని అంటున్న మాటలు  కర్నాటకలో కూడా నమ్ముతున్నారు. అంటే అవి మంత్రాక్షరాలుగా పనిచేసాయి. పేదలు, అణగారిన వర్గాలు తమ జీవితాలను మెరుగ్గా తీర్చిదిద్దుకునే దేశాన్ని తయారు చేయాలన్న సంకల్పం స్వాగతించాల్సిందే. ఈ ఎన్నికల ఫలితాలు చూస్తే ప్రజలు బిజెపి వైపు ఆశగా చూస్తున్నారు. బిజెపి మాత్రమే ఏదైనా చేయగలదన్న నమ్మకంతో ఉన్నారు. బిజెపికి సరికొత్త  శక్తి, స్ఫూరినివ్వడానికి ఈ ఫలితాలు దోహద పడతాయని భావించాలి.  ఈ దేశంలో పేదలు తమకోసం ఏదో ఒకటి జరగాలని కోరుకుంటున్నారు. తమకు కొత్త అవకాశాలు రావాలని, తమ బతుకులు బాగు పడాలని చూస్తున్నారు.