బిజెపి విధానాలు దేశానికి ప్రమాదం: ఏచూరి

హైదరాబాద్‌,డిసెంబర్‌27(జ‌నంసాక్షి): బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు దేశానికి చేటుగా పరిణమించాయని సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి  విమర్శించారు.  నగరంలోని ఉస్మానియా యూనివర్సిటీలో సేవ్‌ ఇండియా- సేవ్‌ రాజ్యాంగం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ…  పౌరసత్వ సవరణ చట్టం, ఎన్‌ఆర్‌సీ అనేవి రాజ్యాంగ విరుద్దమని ఆయన అన్నారు. దేశంలో బీజేపీ మతోన్మాదానికి పాల్పడుతుందని అన్నారు. ఎన్‌ఆర్‌సీ పేరుతో ప్రజలను మతోన్మాదంవైపు తిప్పుతోందని అన్నారు. భారత దేశాన్ని లౌకికవాద దేశం నుండి హిందుత్వ దేశంగా మార్చాలని ఆర్‌ఎస్‌ఎస్‌తో కలిసి ప్రధాని మోడీ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. దేశంలో ఆర్థిక మందగమనాన్ని పక్కదారి పట్టించేందుకే కేంద్రం సీఏఏను ముందుకు తీసుకువచ్చిందని ఆరోపించారు. ధరలను తగ్గించడంతో కూడా కేంద్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. విద్యార్దులంతా కలిసి దేశాన్ని కాపాడాలని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.