బిజెపి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ సెంటిమెంట్‌

గుజరాత్‌ ప్రచారం వేడెక్కింది. రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. విమర్శలకు పదను పెడుతున్నారు. ప్రధాని మోడీ గుజరాత్‌ ఎన్నికల విషయంలో పట్టుదలగా ఉండడం, కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ కూడా అంతే పట్టుదలగా ఉండడంతో గుజరాత్‌ గతంలో ఎన్నడూ లేనంతగా వేడెక్కింది. ఇక్కడి ప్రచారం కార్యక్రమాలు, అభివృద్దిపై కాకుండా వ్యక్తిగత దూషణలకు, విమర్శలకు కేంద్ర బిందువుగా మారింది. గుజరాత్‌లో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ విలువలు జారిపోతున్నాయనడానికి ఇంతకన్నా నిదర్శనం అక్కర్లేదు. ఎన్నికల సమయంలో నాయకుల మాటతీరు మారిపోతోంది. దిగజారుడు వ్యాఖ్యలు చేయడం ద్వారా హుందాతనం కోల్పోతున్నారు. గుజరాత్‌లో కాంగ్రెస్‌, బీజేపీ ప్రచారం పతాకస్థాయికి చేరడంతో ప్రచారంలోకి ఊహించని అంశాలు చోటుచేసుకుంటున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో అభివృద్ది గురించి మాట్లాడి, అందుకు గుజరాత్‌ను నిదర్శనంగా చూపి దేశాధికారాన్ని దక్కించుకున్న నరేంద్ర మోదీ ఎందుకో గానీ ఇప్పుడు స్వరాష్ట్రంలో అభివృద్దిని పక్కన పెట్టి సెంటిమెంట్‌ ప్రయోగిస్తున్నారు. గుజరాత్‌ ఎన్నికలు ప్రధానంగా కులం, మతం, కుట్రల చుట్టూ తిరుగుతున్నాయి. రాహుల్‌గాంధీ సోమనాథ ఆలయ సందర్శన వివాదం ఎన్నికల నేపథ్యంలో రగిలిన అంశాల్లో ఒకటి. ఈ ఎన్నికల్లో విజయం ఖాయమని విూడియా సర్వేలు, బెట్టింగ్‌ బాబులు మొత్తుకుంటున్నా, రాహుల్‌ మతం, పుట్టుపూర్వోత్తరాలు, ఆయన తాతల తీరు తెన్నులూ ప్రస్తావిస్తూ ఎదురుదాడికి దిగుతున్నారు. మొన్నటికి మొన్న దివంత ఇందిరాగాంధీపై తూటాలు పేల్చిన ప్రధాని మోడీ ఇప్పుడు ఆమె తండ్రి దివంతగా తొలి ప్రధాని నెహ్రూపై విమర్శలు సంధించారు. మొత్తంగా పటేల్‌ గొప్పవాడని, నెహ్రూ సమర్దుడు కాదని చెప్పడం మోడీ ఉద్దేశ్యంగా కనిపించింది. కాంగ్రెస్‌ లో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూటిగా విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ లోనే ప్రజాస్వామ్యం లేనప్పుడు ఇక దేశంలో దానిని ఆ పార్టీ ఎలా పాటిస్తుందని ప్రశ్నించారు. దేశానికి ఎవరు ప్రధానమంత్రిగా ఉండాలో నిర్ణయించడానికి ఒకసారి కాంగ్రెస్‌ పార్టీ సమావేశం నిర్వహించింది. దానిలో జవహర్‌లాల్‌ నెహ్రూ కంటే సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌కు ఎక్కువ ఓట్లు వచ్చాయి. అయినా రిగ్గింగ్‌ చేసి నెహ్రూ గెలిచేలా చూశారు. మొరార్జీ దేశాయ్‌ విషయంలోనూ ఇలాగే అడ్డుకున్నారు. ఎన్నికల్లో రిగ్గింగు చేసే చరిత్ర కాంగ్రెస్‌కి ఉంది. ఆ పార్టీకి చెందిన షెహజాద్‌ పూనావాలా అనే వ్యక్తి అంతర్గత ఎన్నికల గురించి, దానిలో రిగ్గింగ్‌పైనా ప్రశ్నిస్తే నోరు నొక్కేశారు… సామూహికంగా బహిష్కరించారు. బయటకేమో ఎప్పుడూ సహనం… సహనం… సహనం అని వల్లెవేస్తారు. లోపల మాత్రం ఇలాంటి యువకుడి నోరు కట్టేస్తారు అని ప్రధాని విమర్శించారు. కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికల్లో ఫలితమేమిటో ముందే నిర్ణయమైపోయిందని రాహుల్‌ను ఉద్దేశించి అన్నారు. మొత్తంగా ఇక్కడ నెహ్రూపై విమర్శలకన్నా సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌కు అన్యాయం చేశారని మరోమారు గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో ప్రధాని ప్రస్తావించడం ద్వారా సానుభూతి పొందే ప్రయత్నం చేశారు. కులమత ప్రాతిపదికన సమాజాన్ని విభజించడానికి కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందని మోదీ ఆరోపించారు. సోదరుల మధ్య సయితం విభజనను కాంగ్రెస్‌ కోరుకొంటోందని చెప్పారు. కాంగ్రెస్‌ అంటే ఏమిటో గుజరాత్‌ ప్రజలకు బాగా తెలుసు. ఎప్పటి కప్పుడు రంగులు మార్చే పార్టీ అది. ఒక కులం మరో కులంతో, ఒక మతం మరో మతంతో పోట్లాడుకునేలా ఆ పార్టీ చేస్తోంది. విూరు అలా ఒకరితో ఒకరు కలహించుకునేలా చేసి, ఆ పోరాటంలో విూ ప్రాణాలు పోతున్నా వాళ్లు మాత్రం మలై తింటారంటూ విమర్శలు చేశారు. రాహుల్‌ మతం, ఆయన కుటుంబంలో జరిగిన కులాంతర,మతాంతర వివాహాలను ఈ ఎన్నికల సందర్భంగా రచ్చకు లాగడం బీజేపీ లక్ష్యమని ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు. దీనికి ముందు, ప్రధాని స్వయంగా రాహుల్‌ తాత నెహ్రూను సోమనాథ్‌ ఆలయ పునరుద్ధరణ వివాదంలోకి లాగారు. ఆలయాన్ని ఆరంభించే కార్యక్రమంలో రాష్ట్రపతి రాజేందప్రసాద్‌ పాలుపంచుకోవడాన్ని నెహ్రూ వ్యతిరేకించారని మోదీ విమర్శించారు. నెహ్రూ, గాంధీలను హిందూ వ్యతిరేకులుగా ముద్రవేయడం బీజేపీ నాయకుల తీరుగా కనిపిస్తోంది. అయితే ఇదే సందర్భంలో జాతీయవాదం, మానవతావాదం తమను నడిపిస్తున్నాయని చెప్పారు.రాహుల్‌గాంధీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కావడంపైనో, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయంపైనో గుజరాత్‌ ఫలితాలు చూపించే ప్రభావం తీవ్రంగా ఉంటాయనడానికి ఇంతకన్నా నిదర్శనం అక్‌ర్లేదు. స్వరాష్ట్రం గుజరాత్‌లో గతంలో కన్నా పదిస్థానాలు తగ్గినా మోదీ పరువుపోవడం ఖాయం. అందుకే ఈ ఎన్నికల్లో విలువల గురించి ప్రస్తావన లేకుండా పోయింది. అభివృద్ది మంత్రం, తన మూడున్నరేళ్ల పాలనను పక్కన పెట్టారు. కాంగ్రెస్‌ను దాని వారసత్వాన్ని విమర్శించడమే లక్ష్యంగా ప్రచాం చేస్తున్నారు. అందుకే రాహుల్‌ ప్రచారంపైనా, ఆయన సోమా/-/-నాథ్‌ ఆలయ సందర్శన సందర్భంగా వివాదం రేకెత్తించారు. దీనికితోడు గుజరాతీ చానెళ్ళు, పత్రికలు రాహుల్‌ హిందువు అవునా కాదా అన్న రగడను తెరపైకి తసీఉకుని వచ్చాయి. హిందువు కాడని నిరూపించే లక్ష్యంతో చర్చలు, కథనాలు రావడం తో కాంగ్రెస్‌ భయంతో వణికిపోయింది. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ మరో అడుగుముందుకు వేసి రాహుల్‌ బ్రాహ్మణుడనీ, ఆయన జంధ్యం ధరించే హిందువనీ చెప్పుకోవడం దాని దిగజారుడుతనాన్ని నిరూపిం చింది.యూపీఏ పాలనలో అమెరికాలో భారత రాయబారిగా ఉన్న విూరాశంకర్‌ సోనియాగాంధీని క్రిస్టియన్‌గా పరిచయం చేసిన సందర్భం నుంచి ఆ కుటుంబానికి సంబంధించిన కులమతాల చిట్టానంతా వరుస ట్వీట్లు చేశారు. అందుకే రాహుల్‌ కూడా సోమ్‌నాథ్‌ పర్యటన తరవాత తన కుటుంబీకులు శివభక్తులని చెప్పుకో వడం ఎన్నికల ఎత్తుగడానే చూడాలి. మొత్తంగా గుజరాత్‌ ప్రచారంలో పటేల్‌ కన్నా నెహ్రూ గొప్పవాడు కాదని,పటేల్‌ను అణచివేశారని చెప్పడంలో ప్రధాని మోడీ విజయం సాధించారు. ఇది ఏమేరకు ఫలించగలదో ఫలితాలను బట్టి తెలుస్తుంది.