బిల్కిస్ బానో అత్యాచార కేసులో శిక్ష అనుభవిస్తున్న 11 మంది దోషులను విడుదల చేయడంపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం

బిల్కిస్ బానో దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడంతో వ్యవస్థ మీద నమ్మకం పోయింది. బిల్కిస్ బానో దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడంతో వ్యవస్థ మీద నమ్మకం పోయింది.
 మహిళలను గౌరవించాలని ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి మోడీ చెప్పిన మాటల్లో నిజాయితీ ఉంటే గుజరాత్ ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చెయ్యాలి. వాళ్లను తిరిగి జైలుకు పంపాలి.
 రేపిస్టులందరికీ జీవితఖైదు లేదా ఉరిశిక్ష విధించాలి.
 ఇండియన్ పీనల్ కోడ్,  క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, జువైనల్ జస్టిస్ చట్టానికి సవరణలు చేసి రేపిస్టులకు బేయిల్ దొరకకుండా చేయాలన్న కేటీఆర్
2002 గుజరాత్ అల్లర్ల సమయంలో గ్యాంగ్ రేప్ కు గురైన బిల్కిస్ బానో కేసులో దోషులను ఆ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడంపై ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను దేశం మొత్తం సంబురంగా జరుపుకుంటున్న సందర్భంలో హేయమైన చర్యకు పాల్పడిన 11 మంది రేపిస్టులను విడుదల చేయడం బాధాకరం అన్నారు. ఐదునెలల గర్భవతి అయిన బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం చేసిన రేపిస్టులను విడుదల చేసి గుజరాత్ ప్రభుత్వం తన హీన మనస్తత్వాన్ని బయటపెట్టుకుందని విమర్శించారు. గుజరాత్ ప్రభుత్వ చర్యతో వ్యవస్థల మీద నమ్మకం పోతుందన్న కేటీఆర్, ఈ విషయంలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ తక్షణం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. స్త్రీలను గౌరవించాలని అగష్టు 15 నాడు ఎర్రకోట మీది నుంచి దేశానికి నిర్దేశించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మాటల్లోని నిజాయితీని నిరూపించుకోవాల్సిన సమయం ఇదే అన్నారు. 11 మంది రేపిస్టులను విడుదల చేసిన గుజరాత్ ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేసి, వాళ్లను తిరిగి జైలుకు పంపి ప్రధాని మోడీ తన చిత్తశుద్ది, నిబద్దతను దేశానికి చూపించాలన్నారు.
చట్టాల్లో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకుని రేపిస్టులు తప్పించుకుంటున్నారన్న కేటీఆర్, మొన్న హైదరాబాద్ లో జరిగిన అత్యాచారం విషయంలోనూ నిందితులు మైనర్ అన్న ఒకే ఒక్క కారణంతో కఠిన శిక్ష నుంచి తప్పించుకున్నారని, బెయిల్ పొందారని తెలిపారు.18 ఏళ్లు కన్నా తక్కువ వయసు ఉన్నవాళ్లు అత్యాచారానికి పాల్పడితే 3 ఏళ్లకు మించి శిక్ష విధించే అవకాశం ప్రస్తుత చట్టాలతో లేదన్నారు. రేప్ లాంటి దుశ్చర్యలకు పాల్పడే మైనర్లను మేజర్ లుగానే భావించి ఆ మేరకు కఠిన శిక్షలు విధించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. చిన్నతనం నుంచే పిల్లలకు సామాజిక అవగాహన, చైతన్యం కలిగించడంతో పాటు రేప్ లాంటి నేరాలకు పాల్పడితే చనిపోయేదాక జైలు శిక్ష లేదా ఉరిశిక్ష విధించినప్పుడే అత్యాచారాలు ఆగే అవకాశం ఉందన్నారు కేటీఆర్. బలమైన చట్టాలు ఉన్నప్పుడే న్యాయవ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుందన్న కేటీఆర్, మన సమాజం, మన పిల్లలకు మంచి జరగాలంటే ఇండియన్ పీనల్ కోడ్ (IPC), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CRPC), జువైనల్ జస్టిస్ చట్టానికి సవరణలు చేయాలని విజ్ఞప్తి చేశారు. రేపిస్టులకు న్యాయస్థానాలు బేయిల్ ఇవ్వకుండా చూడాలని ప్రధానమంత్రి మోడీని కోరిన కేటీఆర్, రాజకీయంగా ఎన్ని విభేధాలు ఉన్నా, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి తమ సహకారాన్ని అందిస్తామన్నారు.