బిసి రిజర్వేషన్లపై విపక్షాలది అనవసర రాద్దాంతం

చిత్తశుద్దితో రిజర్వేషన్లు పెంచిందే తాము
రిజర్వేషన్లు పెంచకుండా కోర్టుకు వెళ్లిందే కాంగ్రెస్‌
హైకోర్టు, సుప్రీం తీర్పుల మేరకు నడుచుకోవడమే మా కర్తవ్యం
బిజెపి దద్దమ్మలు కేంద్రాన్ని ఎందుకు ఒప్పించరు
జనవరిలోగా పంచాయితీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తాం
రాజకీయంగా బిసిలకు గుర్తింపునిచ్చిందే ఎన్టీఆర్‌
విూడియా సమావేశంలో నిప్పులు చెరిగిన సిఎం కెసిఆర్‌
హైదరాబాద్‌,డిసెంబర్‌29(జ‌నంసాక్షి): బీసీ రిజర్వేషన్లపై విపక్ష పార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మండిపడ్డారు. హైకోర్టు, సుప్రీం కోర్టుల తీర్పు మేరకు తమకు ఉన్న పరిధిలో రిజర్వేషన్లు ఖరారు చేసుకుని ఎన్నికలకు వెళ్లాల్సిన ఆగత్యం ఏర్పడిందని అన్నారు. 50శాతం మించి రిజర్వేషన్లు కేటాయించవద్దన్న సుప్రీం తీర్పు, వందరోజుల్లో ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు తీర్పును ఔదలదాల్చడం మినహా ప్రభుత్వానికి మరో గత్యంతరం లేదన్నారు. వనివారం ప్రగతిభవన్‌లో ఆయన వివిధ అంశాలపై విూడియాతో సుదీర్ఘంగా మాట్లాడారు. గతంలో కాంగ్రెస్‌ పాలన వల్లే బీసీల్లో కులవృత్తులు కనుమరుగయ్యాయని ఆక్షేపించారు. కాంగ్రెస్‌, భాజపా బీసీలపై ప్రేమ ఒలకబోసేలా మాట్లాడుతున్నాయని, తమకు వారికంటే  బీసీలపై ప్రేమ ఉందని తెలిపారు. తమ పార్టీ రాజ్యాంగంలోనే బిసిలకు అధిక స్థానాలు ఉండేలా చేశామని అన్నారు. అలాగే రేపటి ఎన్నికల్లో కూడా పంచాయితీల్లో పార్టీ పరంగా బిసిలకు అధికస్థానాలు కేటాయిస్తామని అన్నారు. బిజెపికి చిత్తశుద్ది ఉంటే రిజర్వేషన్ల పరిధి రాష్ట్రాలకు ఉండాలన్న తమ డిమాండ్‌ మేరకు రాజ్యాంగ సవరణ చేయాలని కేంద్రంపై ఎందుకు ఒత్తిడి చేయడం లేదన్నారు. రాజ్యాంగ సవరణ అన్నది ప్రజలకోసమే అని, అందుకు వెనకాడాల్సిన ఆగత్యం లేదన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా తరఫున 11 మంది కేంద్రమంత్రులు, ప్రధాని నరేంద్ర మోదీ, కొందరు సీఎంలు వచ్చి ప్రచారం చేశారని, 118 స్థానాల్లో పోటీచేస్తే భాజపాకు 103 చోట్ల డిపాజిట్లు గల్లంతయ్యాయన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నేతలు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రజలు ఎన్నికల్లో తీర్పు ఇచ్చినా కొన్ని పార్టీలకు ఇంకా బుద్ధి రాలేదని వ్యాఖ్యానించారు. ఆరు మాసాలు కూడా వేచి చూడకుండా పసలేని ఆరోపణలు చేయడం మంచిది కాదన్నారు. తెలంగాణలో తెరాస ప్రభుత్వం రాకముందు బీసీ రెసిడెన్షియల్‌ పాఠశాలలు 19 ఉంటే.. ఇప్పుడు 261 ఉన్నాయని చెప్పారు. మార్కెట్‌ కమిటీలలో బీసీలకు రిజర్వేషన్లు తెచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. రూ.4వేల కోట్లతో 74 లక్షల గొర్రెలను పంపిణీ చేశామని తెలిపారు. గౌడ, గొల్లకురుమ, ముదిరాజ్‌, నాయి బ్రాహ్మణ వంటి బీసీ కులాలకు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించామని తెలిపారు.బీసీలకు రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ నేతలే కోర్టులో కేసు వేస్తే.. హైకోర్టు, సుప్రీంకోర్టు కొట్టివేశాయ న్నారు. రిజర్వేషన్లు పెంచాలని అంటున్న వారే.. 50శాతం దాటకూడదని కోర్టుల్లో కేసు వేశారని ఆక్షేపించారు. ఇంతకుముందే 69.19 శాతం రిజర్వేషన్ల ప్రాతిపదికన నోటిఫికేషన్‌ ఇచ్చామని, 100 రోజుల్లో పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు చెప్పిందన్నారు. ప్రతి విషయంలో అమలు చేయాలని, రద్దు చేయాలని రెండు రకాలుగా కేసులు వేసేది కాంగ్రెస్‌ పార్టీయేనని ఎద్దేవా చేశారు. జనవరి నెలలో పంచాయతీ ఎన్నికలు పూర్తవుతాయని సీఎం స్పష్టంచేశారు. బీసీలకు 33శాతం రిజర్వేషన్లపై తీర్మానం
చేసి కేంద్రానికి పంపామని, రిజర్వేషన్ల బిల్లులను ఆమోదించకుండా కేంద్రం పెండింగ్‌లో పెట్టిందని విమర్శించారు. 15 కార్పొరేషన్‌లకు ఛైర్మన్లుగా కూడా బీసీలనే నియమించామని ఈ సందర్భంగా కేసీఆర్‌ తెలిపారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వశాఖ పెట్టాలని కేంద్రాన్ని ఎన్నోసార్లు కోరామని తెలిపారు. పార్టీ కమిటీల్లో కూడా 50శాతానికి పైగా బీసీలు ఉండాలనేది తెరాస నియమమని తెలిపారు. రాజకీయంగా బీసీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్‌ అని కొనియాడారు. వచ్చే జనవరిలో పంచాయతీ ఎన్నికలు పూర్తవుతాయని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. శాసన సభ ఎన్నికలు పూర్తయ్యాయి. ఫలితాలు వచ్చాయి. పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడి, అర్థంపర్థం లేకుండా మాట్లాడితే ప్రజల తీర్పు ఎలా ఉంటుందో స్పష్టమైంది. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు. కాంగ్రెస్‌, బీజేపీలు బీసీల విూద తెగ ప్రేమ ఒలకబోస్తున్నారు. ఎవరికి ప్రేమ ఉన్నది.. ఎవరికి లేదనేది ప్రజలకు తెలియదా? అని అన్నారు. ఎవరికి ఉన్నది బీసీల విూద ప్రేమ. మార్కెట్‌ కమిటీలలో బీసీలకు రిజర్వేషన్‌ తీసుకొచ్చిన మొట్టమొదటి ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ. ఎంబీసీలకు కార్పొరేషన్‌ పెట్టింది కూడా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే. చేనేతలను ఆదుకున్నది.. ఉపాధి కల్పించింది… గీత కార్మికులకు చెట్ల పన్ను రద్దు చేసి కల్లు దుకాణాలు తెరిపించింది… యాదవులకు లక్షల సంఖ్యలో గొర్రెలను పంపిణీ చేసింది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం. కాంగ్రెస్‌ హయాంలో బీసీ వృత్తులన్నింటినీ నాశనం చేశారు. సెంబ్లీ ఎన్నికల ముందే పంచాయతీ ఎన్నికలు పెట్టడానికి ప్రయత్నించాం. దానికి సంబంధించి కొత్త పంచాయతీ రాజ్‌ యాక్ట్‌ కూడా తెచ్చాం. యాక్ట్‌ అసెంబ్లీలో పాస్‌ అయింది. దాని ప్రకారం నోటిఫికేషన్‌ ఇచ్చాం. 34 శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇస్తూ మొత్తం 61.19 శాతం రిజర్వేషన్లు పెట్టాం. స్వప్నారెడ్డి అనే రంగారెడ్డి జిల్లాలోని ఓ గ్రామ సర్పంచ్‌, భూపాల్‌ రెడ్డి అనే సర్పంచ్‌ సంఘం నాయకుడు.. వీళ్లిద్దరూ కాంగ్రెస్‌ నాయకులే. వీళ్లు రిజర్వేషన్లు 50 శాతం ఉండాలె అని హైకోర్టుకు పోయారు. దీంతో హైకోర్టు 61.19 రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. వెంటనే మేం సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేశాం. 61.19 పెట్టుకుంటామని కోరాం. సుప్రీం కూడా 50 కి దాటొద్దని కొట్టేసింది. ఒకవైపు జనవరి 10 లోపు 100 రోజుల్లో ఎన్నికలు పెట్టాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది.. మరోవైపు 50 శాతం రిజర్వేషన్లు దాటొద్దని సుప్రీం తీర్పు ఇచ్చింది. ఏం చేయాలి.. కోర్టుల తీర్పును ధిక్కరించకూడదు కదా.. అందుకే.. రిజర్వేషన్లను 50 శాతానికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్‌ ఇవ్వాల్సి వచ్చిందని వివరించారు. 50 శాతం మించొద్దని కోర్టుకు పోయిన కాంగ్రెస్‌ నేతలే.. ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారు. దారుణంగా అబద్ధాలు మాట్లాడుతున్నారు. పార్లమెంట్‌ వేదికగా… ప్రధానిని రిజర్వేషన్లపై టీఆర్‌ఎస్‌ ఎంపీలు నిలదీసి అడిగినా… పట్టించుకోలేదు. నేను కూడా చెప్పా. అక్కడ ఎవ్వరూ పట్టించుకోరు. ఇక్కడ లక్ష్మణ్‌ మాత్రం లొడలొడా వాగుతున్నాడు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు బీసీలను నాశనం చేశాయి తప్ప ఏం చేయలేదు. సీఎం తర్వాత ప్రోటోకాల్‌ ఉండే రెండు పోస్టులు మండలి చైర్మన్‌, శాసనసభాపతి.. బీసీలకే ఇచ్చాం. ఇలా 15 కార్పొరేషన్‌ చైర్మన్లను ఆర్టీసీతో సహా కూడా బీసీలను నియమించాం. మా రిజర్వేషన్‌ కారణంగా 50 మంది మార్కెట్‌ కమిటీ చైర్మన్లు బీసీలు అయ్యారు. విప్‌ పదవి.. ఇలా బీసీలకు చాలా ఇచ్చాం. బీసీలకు ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌లు 20 లక్షలు ఇస్తున్నాం. కాంగ్రెస్‌ హయాంలో ఆ పథకమే లేదు. అన్ని వర్గాలకు ఆత్మగౌరవ భవనాలు రాజధానిలో నిర్మిస్తున్నాం. మన్మోహన్‌ నుంచి మోదీ దాక ఎవరు కూడా కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను పెట్టలేకపోయారు. బీసీ మంత్రిత్వ శాఖను పెట్టాలని అప్పుడు మన్మోహన్‌ను కోరాం.. ఇప్పుడు మోదీని కూడా కోరుతున్నాం. అయినా ఎవ్వరూ పట్టించుకోరు. కానీ.. ఇప్పుడు మాత్రం బీసీలపై ప్రేమ ఒలకబోస్తున్నారు.. అంటూ సీఎం కేసీఆర్‌ బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలపై మండిపడ్డారు. విూడియా సమావేశంలో కెకె, శ్రీనివాసగౌడ్‌ తదితరులు ఉన్నారు.