బీజేపీకి యశ్వంత్ సిన్హా గుడ్ బై

సీనియర్ బీజేపీ నేత, మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. బీజేపీ పార్టీకి గుడ్ బై చెప్పారు. వాజ్ పేజ్ ప్రభుత్వం కాలంలో యశ్వంత్ సిన్హా కేంద్ర మంత్రిగా, పార్టీ ముఖ్యనేతగా వ్యవహరించారు. నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి అయినప్పటి నుంచి ఆయన పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని బహిరంగంగానే వ్యతిరేకించారు. కొన్ని నెలలుగా బీజేపీలోని అంతర్గత విషయాలు, పార్టీ వ్యవహారాలను తప్పుబడుతూ వస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ కూడా స్వతంత్రంగా వ్యవహరించటం లేదని అభిప్రాయపడ్డారు.

బీహార్ రాజధాని పాట్నాలో ఏప్రిల్ 21వ తేదీ శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న యశ్వంత్ సిన్హా బీజేపీకి గుడ్ బై చెబుతున్నట్లు వెల్లడించారు. అంతే కాకుండా దేశంలో సంక్షోభం ఉన్నప్పుడు.. పరిష్కారానికి నేను ముందు ఉంటానని తెలిపారు. బీజేపీకే కాకుండా.. రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. బీజేపీతో ఉన్న అనుబంధాలు అన్నింటినీ ఈరోజుతో తెగదెంపులు చేసుకుంటున్నట్లు ప్రకటించారు.