బీజేపీ, చంద్రబాబు కలిసి ..

ఏపీ గొంతు కోశారు
– కాంగ్రెస్‌కు పూర్వవైభవాన్ని తీసుకొస్తాం
– విభజన హావిూలు అమలు కావాలంటే కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలి
– నాలుగేళ్లలో రైతుల కోసం బీజేసీ చేసింది శూన్యం
– కార్పేరేట్‌ శక్తులకు కేంద్రం కొమ్ముకాస్తుంది
– ఏపీ కాంగ్రెస్‌ వ్యవహరాల ఇన్‌చార్జి ఉమెన్‌ చాంది
నెల్లూరు, జులై12(జ‌నం సాక్షి) : భారతీయ జనతా పార్టీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కలిసి ఆంధప్రదేశ్‌ ప్రజల గొంతు కోశారని ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ ఊమెన్‌ చాందీ మండిపడ్డారు. గురువారం నెల్లూరులోని ఇందిరా భవన్‌లో నియోజకవర్గాల వారిగా నేతలతో సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఏపీలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ పూర్వ వైభవానికి అందరూ కృషి చేయాలని పార్టీ శ్రేణులకు ఊమెన్‌ చాందీ పిలుపునిచ్చారు. ఏపీ కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోటగా మార్చాలన్నారు. ఏపీ ప్రజలు కాంగ్రెస్‌ ను తప్పుగా అర్థం చేసుకున్నారని విభజనకు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయని గుర్తు చేశారు. విభజన హావిూలు అమలు చేయాలంటే మళ్లీ కాంగ్రెస్‌ రావాలన్నారు. దేశ ప్రజలు రాహుల్‌ గాంధీ నాయకత్వం కోరుకుంటున్నారని తెలిపారు. ఏపీ ప్రజల ఆత్మ గౌరవంతో బీజేపీ ఆడుకుంటోందని చాంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు సవిూపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీపై ప్రధాని నరేంద్ర మోడీ దుష్పచ్రారం చేస్తున్నారని మండిపడ్డారు. రైతులే మా పార్టీకి వెన్నుముక అని స్పష్టం చేసిన ఊమెన్‌ చాందీ… నాలుగేళ్ల పాలనలో రైతుల కోసం బీజేపీ ఏం చేసింది..? అని ప్రశ్నించారు. కార్పొరేట్‌ శక్తులకు బీజేపీ కొమ్ము కాస్తోందని ఆరోపించారు. రైతులు పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వడంలో బీజేపీ విఫలం అయ్యిందన్నారు. అంతకుముందు నెల్లూరు చేరుకున్న ఊమెన్‌ చాందీకి జిల్లా నేతలు భారీ ర్యాలీతో ఘనస్వాగతం పలికారు.