బీమాతో రైతు కుటుంబాల్లో ధీమా

– గత ప్రభుత్వాలు రైతులను అప్పుల ఊబిలోకి నెట్టాయి

– అధికారంలోకి రాగానే రూ.17వేల కోట్ల రుణమాఫీ చేశాం

– అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ నెం.1 స్థానంలో ఉంది

– నిరంతరాయ విద్యుత్‌ను అందిస్తున్న రాష్ట్రం మనదే

– 24లక్షల మెట్రిక్‌ టన్నులకు గోదాములను పెంచాం

– ఆగస్టు 15 నుంచి ‘కంటి వెలుగు’

– దీపావళి నాటికి మిషన్‌భగీరథ నీటిని అందిస్తాం

– రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌

– సిరిసిల్లలో రైతు జీవిత బీమా పత్రాలను అందించిన కేటీఆర్‌

రాజన్న సిరిసిల్ల, ఆగస్టు8(జ‌నం సాక్షి) : రైతు బీమాపథకం రైతు కుటుంబాలకు ధీమాగా ఉంటుందని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలం తెర్లుమద్దిలో రైతులకు జీవిత బీమా పత్రాలను మంత్రి కేటీఆర్‌ అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ స్వయాన రైతు కనుక రైతుబంధు, రైతు బీమా పథకాలు తీసుకొచ్చారని తెలిపారు. గత ప్రభుత్వాలు రైతులను అప్పుల ఊబిలోకి నెట్టాయని, రైతులు అప్పుల ఊబిలో ఉండొద్దనే 17 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశామన్నారు. దేశంలోనే తెలంగాణ నెంబర్‌ వన్‌ స్థానంలో ఉందని, రాష్ట్రంలో అభివృద్ధిలో సిరిసిల్ల అగ్రభాగాన ఉందని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. దేశంలోనే వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్‌ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని తెలిపారు. నిరంతరం కరెంట్‌ ఉంటోంది కనుక రైతులు మోటార్లకు బిగించిన ఆటో స్టార్టర్లను తొలగించాలని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 92 వేల మంది రైతులకు రైతుబంధు చెక్కులు అందించామని, నిధులకు కొదువలేదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్‌ కింద కేసు పెట్టేలా చట్టం తెచ్చామని వెల్లడించారు. ఒకప్పుడు ఎరువులు, విత్తనాలను పోలీస్‌ స్టేషన్లలో అమ్మేవాళ్లని, కానీ తెలంగాణ ప్రభుత్వం ఎరువులు, విత్తనాలను అందరికి అందుబాటులో ఉంచుతోందని వివరించారు. తెలంగాణ రాకముందు రాష్ట్రంలో 4 లక్షల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల గోదాములు ఉంటే ఇప్పుడు 24 లక్షల మెట్రిక్‌ టన్నులకు పెంచుకున్నామని చెప్పారు. ఈ నెల 15 నుంచి తెలంగాణ కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. అందరికీ ఉచితంగా కంటి పరీక్షలు చేయిస్తామని, అవసరమైన వారికి అద్దాలు ఇస్తామని, ఆపరేషన్లు చేస్తామని వివరించారు. దీపావళి నాటికి ఇంటింటికి మిషన్‌ భగీరథ ద్వారా మంచినీరు సరఫరా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.