బీసీ డిమాండ్లను ఎన్నికల మెనిఫెస్టోలో చేర్చాలి..

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మండ్లు

టీఆర్‌ఎస్‌ తప్ప అన్ని పార్టీలు మద్దతు కోసం సంప్రదించాయి

మాట్లాడుతున్న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మండ్లు

సిరిసిల్ల, నవంబర్‌11(జనంసాక్షి)

అన్ని రాజకీయ పార్టీలు బీసీ డిమాండ్లను ఎన్నికల మెనిఫెస్టోలో చేర్చాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మండ్లు అన్నారు. ఆదివారం రోజున పట్టణంలోని బీసీ భవన్‌లో బీసీ సంక్షేమ సంఘం ముఖ్య కార్యకర్తల అత్యవసర సమావేశం జిల్లా అధ్యక్షుడు రాపెల్లి రమేష్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మండ్లు మాట్లాడుతూ తాను అసెంబ్లీ ఎన్నికల్లో సంఘం నుండి పోటీ చేయనని ప్రకటించిన తర్వాత బీసీ సంక్షేమ సంఘం మద్దతు కొరకు బీజేపీ, బీఎల్‌ఎఫ్‌, కాంగ్రెస్‌ ఆధ్వర్యంలోని మహాకూటమి పార్టీలు మమ్మల్ని సంప్రదించాయన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ఇంతవరకు మద్దతు కోరలేదన్నారు. అయినా టీఆర్‌ఎస్‌ ఇంకా కొందరు అభ్యర్థులను మార్చి బీసీలకు ప్రాధాన్యత ఇస్తుందని, మహా కూటమి బీసీలకు 50స్థానాలు కేటాయిస్తుందని ఆశిస్తున్నారన్నారు. చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్లు కేంద్రంలో మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని కోరారు. బీసీ సబ్‌ప్లాన్‌ ఏర్పాటు బీసీలకు రాష్ట్ర బడ్జెట్‌లో రూ.50వేల కోట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం నుండి బీసీలకు మినహాయింపు ఇవ్వాలన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. బీసీనే ముఖ్యమంత్రిగా చేస్తామని డిమాండ్లను తమ మెనిఫెస్టోలో చేర్చాలని పార్టీలను ఆయన డిమాండ్‌ చేశారు. రెండు మూడు రోజుల్లో సిరిసిల్ల అసెంబ్లీ స్థానానికి పోటీ చేసే అభ్యర్థులతో చర్చ చేసి జిల్లా కమిటీ మరో మారు సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఏలూరి చంద్రకాంత్‌, ఉపాధ్యక్షులు కారంపురి సాయన్న, పట్టణ అధ్యక్షులు దాసరి వెంకటేశ్‌, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు సామల రాజుగౌడ్‌, పట్టణ అధ్యక్షులు చెన్నవేని రాజ్‌కుమార్‌, విద్యార్థి సంఘం నియోజకవర్గం అధ్యక్షులు మల్యాల వినయ్‌గౌడ్‌, గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు కందుకూరి రామాగౌడ్‌, సీనియర్‌ నాయకులు మచ్చ యశ్వంత్‌, ఎనగంటి ఆంజనేయులు పాల్గన్నారు.