బూస్టర్‌ డోసుపై నిర్ణయం తీసుకోండి ` ఐఎంఏ డిమాండ్‌


దిల్లీ,డిసెంబరు 7(జనంసాక్షి): కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కలవరం పుట్టిస్తోన్న వేళ.. కరోనా టీకా అదనపు డోసులపై ప్రకటన చేయాలని ది ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఏ) ప్రభుత్వాన్ని కోరింది. వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌, బలహీన రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తులకు అదనపు డోసు ఇవ్వాలని సూచించింది. అలాగే 12 నుంచి 18 ఏళ్ల వయసు వారికి టీకాలు వేసే ప్రతిపాదనను వేగంగా పరిశీలించాలని డిమాండ్‌ చేసింది.ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వెలుగుచూసింది. ఆ కేసుల సంఖ్య 23కి చేరింది. ఇవి మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ రకానికి వేగంగా ప్రబలే లక్షణం ఉందని, ఎక్కువ మంది వ్యక్తుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోందని ఐఎంఏ వెల్లడిరచింది.‘దేశంలోని కార్యకలాపాలన్నీ సాధారణ స్థితికి చేరుకుంటున్న తరుణంలో ఇది పెద్ద ఎదురుదెబ్బ. దీనిపై తగిన చర్యలు తీసుకోకపోతే.. భారీ స్థాయిలో మూడో వేవ్‌ను చవిచూడాల్సి రావొచ్చు’ అని ఓ విూడియా సమావేశంలో హెచ్చరికలు చేసింది. ‘ఈ సమయంలో మనం వ్యాక్సినేషన్‌పై శ్రద్ధ వహిస్తే.. భారత్‌ ఒమిక్రాన్‌ ప్రభావాన్ని తప్పకుండా అధిగమించగలదు. అర్హులంతా టీకా తీసుకోవడంపైనే ప్రధానంగా దృష్టిపెట్టాలి. ఇప్పటివరకు టీకాలు చేరుకోనివారికి అవి అందేలా చూడాలి. రెండో డోసు తీసుకోవాల్సిన వారిపై శ్రద్ధ పెట్టాలి. ఈ క్లిష్ట సమయంలో వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌, బలహీన రోగ నిరోధక శక్తి ఉన్న వ్యక్తులకు అదనపు డోసు ఇవ్వడంపై అధికారికంగా ప్రకటన చేయాలని కోరుతున్నాం’ అని ఐఎంఏ విజ్ఞప్తి చేసింది.ప్రారంభ నివేదికలను బట్టి ఒమిక్రాన్‌ సోకిన వ్యక్తుల్లో తీవ్రత తక్కువే ఉందని, డెల్టాతో పోలిస్తే మాత్రం ఐదు నుంచి 10 రెట్లు వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు రోగనిరోధక శక్తిని పెంపొందించడం ద్వారా అంటువ్యాధిని నియంత్రించే చర్యలు చేపట్టాలని సూచించింది. ప్రయాణాలపై ఆంక్షలను తాము సమర్థించనప్పటికీ.. అత్యవసరం కాని ప్రయాణాలను వాయిదా వేయాలని పేర్కొంది. ఆఫ్రికన్‌ దేశాల్లో ఈ వేరియంట్‌ వెలుగుచూసిన తర్వాత.. ఆసుపత్రుల్లో చేరుతున్న చిన్నారుల సంఖ్య అకస్మాత్తుగా పెరుగుతున్న విషయాన్ని గుర్తుచేసింది. పాఠశాలలు, కళాశాలల్లో కొవిడ్‌ ప్రొటోకాల్స్‌ను పాటించాలని తెలిపింది. అలాగే 12 నుంచి 18 ఏళ్ల వయస్సు వారికి టీకాలు వేసే ప్రతిపాదనపై వేగంగా నిర్ణయం తీసుకోవాలని కోరింది.