బెంగాల్లో దుర్గాపూజల నిర్వహణకు నిధులు

ఇందులో జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు
కోల్‌కతా,అక్టోబర్‌10(జ‌నంసాక్షి): పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీకి భారీ ఊరట లభించింది. దుర్గా పూజ కమిటీలకు 10 వేలు ఇవ్వడాన్ని నిరసిస్తూ దాఖలైన పిటీషన్లను కోల్‌కతా హైకోర్టు కొట్టిపారేసింది. వాస్తవానికి ఈనెల 5వ తేదీన ఇచ్చిన తీర్పులో.. డబ్బు పంపిణీపై కోర్టు స్టే విధించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 28 వేల దుర్గా పూజ కమిటీలకు ఒక్కొక్క దానికి 10 వేల ఇవ్వాలని సీఎం మమతా బెనర్జీ నిర్ణయించారు. కానీ కోర్టు నుంచి మొదట్లో అడ్డురావడం కొంత ఆందోళన కలిగించింది. అయితే  హైకోర్టు తన తాజా ఆదేశాలతో దీదీకి ఊరట కల్పించింది. ఇలాంటి సమయంలో ఇలాంటి పిటిషన్లను విచారించ లేమని తాత్కాలిక చీఫ్‌ జస్టిస్‌ దేబషిశ్‌ కార్‌ గుప్తా తెలిపారు.  నవరాత్రుల సందర్భంగా రాష్ట్రంలోని 28 వేల పూజా కమిటీలకు పదివేల రూపాయల చొప్పున నిధులను వెచ్చించాలని పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై జోక్యం చేసుకోవడానికి కోల్‌కతా హైకోర్టు బుధవారం నిరాకరించింది. మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని కోరుతూ  దాఖలైన పిటిషన్‌ను యాక్టింగ్‌ చీఫ్‌ జస్టిస్‌ దేబాశిష్‌ కర్‌ గుప్తా, జస్టిస్‌ సంపా సర్కార్‌తో కూడిన ధర్మాసనం పరిశీలించింది. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై వాదనలు వినిపించిన అనంతరం వ్యయాల కార్యనిర్వహణను ఒక పన్నుదారుడు ప్రశ్నించవచ్చునని కోర్టు పేర్కొంది. గతంలో కోర్టు ఈ నిర్ణయంపై స్టేను విధించి, నిధులపై
వివరణ కూడిన సమాధానం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రజల భద్రతను ప్రోత్సహించడానికి, ‘సేఫ్‌ డ్రైవ్‌, సేఫ్‌ లైఫ్‌’ ప్రచారానికి కమిటీలు ఈ నిధులను ఉపయోగించనున్నాయని ప్రభుత్వం తరుపున న్యాయవాది జనరల్‌ కిషోద్‌ దత్త కోర్టుకు తెలిపారు.