బెంగాల్‌ సీఎంగా మళ్లీ దీదీ


తమిళనాడులో డీఎంకే కూటమి

కేరళలో లెఫ్ట్‌

అసోంలో నువ్వా నేనా

పుదుచ్చేరిలో ఎన్డీఏ

టైమ్స్‌నౌ- సీఓటర్‌ సర్వే ఫలితాలు వెల్లడి

న్యూఢిల్లీ, మారి ్చ9 (జనంసాక్షి):

దేశ రాజకీయాల్లో అంతటా ఇప్పుడు ఒకటే చర్చ. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపెవరిదన్న అంశంపై ఆసక్తి నెలకొంది. పశ్చిమబెంగాల్‌, కేరళ, తమిళనాడు, అసోంలతో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎన్నికల సమర భేరి మోగడంతో దేశ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. అధికార, విపక్షాల నేతలు మాటల తూటాలతో వేసవికి ముందే రాజకీయ సెగలు పుట్టిస్తున్నారు. ఎన్నికల సమయం సవిూపిస్తుండటంతో జాతీయ, ప్రాంతీయ పార్టీలు సత్తా చాటేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. తమ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఓటర్లను తమవైపు ఆకర్షించేందుకు అనేక ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనం నాడిని తెలుసుకొనేందుకు ‘టైమ్స్‌ నౌ-సీ ఓటర్‌’ సంస్థ చేపట్టిన ఒపీనియన్‌ పోల్‌ సర్వే ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. ఇంతకీ ఆ సర్వే ఏం విశ్లేషించింది?పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌, భాజపా మధ్య  ¬రా¬రీగా పోరు జరుగుతుందని సర్వే ఫలితాలు పేర్కొన్నాయి. ఈ కురుక్షేత్రంలో స్వల్ప ఆధిక్యంతో మమతాబెనర్జీ అధికారం నిలబెట్టుకుంటారని టైమ్స్‌ నౌ- సీఓటర్‌ సర్వే ఫలితాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు, తమిళనాడులో డీఎంకే- కాంగ్రెస్‌ – లెఫ్ట్‌ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని పేర్కొంది. కేరళలో మళ్లీ ఎల్డీఎఫ్‌దే విజయమని, అసోం, పుదుచ్చేరిలో మాత్రం ఎన్డీయే కూటమి అధికారంలోకి రావచ్చని అంచనా వేసింది.  294 సీట్లు ఉన్న పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి తృణమూల్‌ కాంగ్రెస్‌కు విజయం అంత సులభమేవిూ కాదని విశ్లేషించింది. అతి కష్టం విూద దీదీ గట్టెక్కుతారని సర్వే ఫలితాలు అంచనా వేశాయి. అయితే, గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి భారీగానే సీట్లు తగ్గుతాయని పేర్కొంది. 2016 ఎన్నికల్లో 211 స్థానాల్లో గెలుపుతో రెండో సారి అధికారంలోకి వచ్చిన దీదీకి ఈసారి కమలనాథుల నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ స్వల్ప మెజార్టీతో హ్యాట్రిక్‌ కొట్టే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు, బెంగాల్‌లో భాజపా ప్రబలమైన శక్తిగా ఎదిగి మమతకు సవాల్‌గా మారింది. 2016 ఎన్నికల్లో కేవలం మూడు స్థానాల్లో గెలిచిన భాజపా ఈసారి భారీగా పుంజుకొని 107 స్థానాల్లో విజయంతో దీదీకి గట్టి పోటీ ఇస్తుందని సర్వే ఫలితాలు సూచిస్తున్నాయి. ఇకపోతే, గత ఎన్నికల్లో  76 స్థానాల్లోనే గెలిచిన వామపక్షాలు- కాంగ్రెస్‌ కూటమి ఈసారి కేవలం 33 స్థానాలకే పరిమితమైపోతుందని తెలిపింది. ఇక్కడ ఇతరుల పెద్దగా ప్రభావం పెద్దగా ఉండదని పేర్కొంది.234 స్థానాలు కలిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో  ఈసారి డీఎంకే హవా కనబడుతోందని సర్వే ఫలితాల్లో తేలింది. ఈ ఎన్నికల్లో పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే- భాజపా కూటమికి 65 స్థానాలే వచ్చే అవకాశం ఉందని తెలిపింది. గత ఎన్నికల్లో జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే 136 స్థానాల్లో సత్తా చాటగా, ఈ ఎన్నికల్లో భాజపాతో జతకట్టి బరిలో దిగిన అన్నాడీఎంకే కూటమికి ఎదురుగాలి వీచే అవకాశం ఉన్నట్టు విశ్లేషించింది. గత ఎన్నికల్లో డీఎంకే- కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ కూటమికి 98 సీట్లు రాగా.. ఈసారి భారీగా పుంజుకొని 158 స్థానాల్లో విజయం లభించే అవకాశం ఉంటుందని పేర్కొంది.కేరళలో సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్‌ కూటమి మరోసారి అధికారంలోకి వస్తుందని సర్వే ఫలితాలు అంచనా వేశాయి. మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 91 స్థానాల్లో గెలుపొందిన ఎల్డీఎఫ్‌.. ఈసారి 82సీట్లు సాధించి రెండోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. అలాగే, గత ఎన్నికల్లో 47 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ ఈసారి పుంజుకొని 56 స్థానాల్లో గెలిచే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. కేరళలో భాజపా పరిస్థితిలో ఎలాంటి మార్పు ఉండబోదని, గత ఎన్నికల్లో ఒక్కస్థానంలో గెలిచిన ఆ పార్టీ ఈసారి ఒక్క స్థానమే గెలిచే అవకాశం ఉన్నట్టు పేర్కొంది.

126 స్థానాలు కలిగిన అసోం అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే- యూపీఏ కూటమి మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పోరు జరుగుతుందని సర్వే అంచనా వేసింది. అయితే, ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 67 స్థానాలు గెలుచుకొని మరోసారి అధికార పీఠం నిలబెట్టుకుంటుందని పేర్కొంది. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏకు 57 సీట్లు వస్తాయని అంచనా వేసింది. 2016 ఎన్నికల్లో 86 సీట్లు గెలుచుకున్న ఎన్డీయే బలం ఈసారి 67కి పడిపోతుందని పేర్కొంది. గత ఎన్నికల్లో 26 సీట్లలో గెలిచిన యూపీఏ ఈసారి భారీగా పుంజుకొని 57 స్థానాల్లో గెలిచే అవకాశం ఉన్నట్టు తెలిపింది.30 స్థానాలు కలిగిన పుదుచ్చేరి అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో ఈసారి ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని సర్వే ఫలితాలు పేర్కొంటున్నాయి. కాంగ్రెస్‌ -డీఎంకే నేతృత్వంలోని యూపీఏ కూటమి 12 సీట్లు సాధించే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఇటీవల అక్కడ కాంగ్రెస్‌ నేత నారాయణస్వామి నేతృత్వంలోని ప్రభుత్వం పడిపోవడంతో ప్రస్తుతం రాష్ట్రపతి పాలన కొనసాగుతున్న విషయం తెలిసిందే.  ఎన్డీయే కూటమి 18, యూపీఏ 12 స్థానాలు గెలుస్తాయని టైమ్స్‌నౌ- సీఓటర్‌ సర్వే ఫలితాలు చెబుతున్నాయి.మరోవైపు, మార్చి 27నుంచి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలలో ఏప్రిల్‌ 6న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. అసోంలో మార్చి 27, ఏప్రిల్‌ 6న రెండు విడతల్లో, పశ్చిమబెంగాల్‌లో ఎనిమిది విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే 2న ఓట్ల లెక్కింపు జరగనుంది.