బ్రిడ్జి డిజైన్‌లో లోపంతో .. 

పదిమంది కార్మికుల మృతి
– కూల్చేసిన కొలంబియా అధికారులు
బగొటా, జులై13(జ‌నం సాక్షి) : 10 మంది కార్మికుల మరణానికి కారణమైన నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిని కొలంబియా అధికారులు కూల్చివేశారు. కాగా, గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌విూడియాలో వైరల్‌గా మారాయి. కొలంబియా రాజధాని బగొటా, విల్లావిసేన్సియో నగరాలను కలిపే హైవేపై చిరజరలోని లోయ పైనుంచి ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టారు. అయితే బ్రిడ్జి నిర్మాణంలో ఉండగానే ప్రమాదవశాత్తూ కూలిపోవడంతో 10 మంది కార్మికులు మృతిచెందారు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు డిజైన్‌లో లోపం కారణంగానే బ్రిడ్జి ప్రమాదానికి కారణమైందని తేలడంతో, భద్రతా చర్యల్లో భాగంగా బ్రిడ్జిని కూల్చేయాలని నిర్ణయించారు. దీంతో 100కిలోల పేలుడు పదార్థాలు, 30 డిటోనేషన్‌ పరికరాలను ఉపయోగించి క్షణాల్లో బ్రిడ్జిని కూల్చివేశారు. నాసిరకం పనుల కారణంగా ప్రాణ నష్టంతో పాటూ భారీ మొత్తంలో నగదు వృథా అయినట్లు అధికారులు వివరించారు. అయితే ఈ బ్రిడ్జిని పుననిర్మించాలని భావిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.