బ్లాక్‌లో ఒదిగిపోతున్న 2వేల నోట్లు

ఇకపై ఏటీఎం లో రూ.2వేల నోటుకు స్థానం లేనట్లే?
న్యూఢిల్లీ,అక్టోబర్‌7 : రెండు వేల రూపాయల నోటు కోసం ఎదురుచూసే పరిస్తితి దాపురించవచ్చని ఎస్‌బిఐ హెచ్చరిస్తోంది. కొందరు అదేపనిగా ఈ నోట్లను బ్లాక్‌ చేస్తున్నారని అనుమానం వ్యక్తంచేసింది. దేశంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రెండువేల రూపాయల నోట్లను  ఇలా విడుదల చేసిన వెంటనే కొందరు  అలా దాచేస్తున్నారని అనుమానాలు వ్యక్తం చేసింది.  2వేల నోటు భారీ కరెన్సీ కావడం వల్ల బడాబాబులు కొందరు  నోట్లను అధిక మొత్తంలో తీసేసుకుని డబ్బు మొత్తాన్ని నల్ల డబ్బుగా మార్చేస్తున్నారట. ఆదాయ పన్నులు కట్టకుండా వారి దగ్గర ఉండే సంపదను మొత్తం ఇలా మార్కెట్‌ లో 2000 రూపాయల నోట్లు దొరకడమే ఆలస్యం అన్నట్లు అన్నీ మాయమైపోతున్నట్లు ఆర్బీఐ గుర్తించింది. అందుకే ఇప్పుడు ఏటీఎం నగదు లావాదేవీల్లో రూ. 2వేల నోటు రాకుండా చర్యలు చేపట్టింది.
ఈ మేరకు ముందుగా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఏటీఎంలలో 2000 నోట్లు పెట్టే క్యాసెట్లను తొలగించింది. ఇక ముందు కూడా 500 రూపాయల నోట్లను కూడా ఆపేసి కేవలం 100 మరియు 200 రూపాయల నోట్లతోనే ఏటీఎం లావాదేవీలు జరిగేలా చూసేందుకు ఎస్బిఐ చర్యలు చేపడుతోంది. ఆర్బిఐ తీసుకున్న ఈ నిర్ణయంతో ఇకపై చిన్న నోట్లు మాత్రమే లభ్యమైతే వినియోగదారులకు చాలా కష్టం. ఉచిత ఎటిఎం లావాదేవీలను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మెట్రోనగరాల్లో 3 సార్లు, పట్టణాల్లో 5 సార్లు మాత్రమే వారికి ఉచితంగా డబ్బులు విత్‌ డ్రా చేసే అవకాశం ఉంది. అందుకే నగరాల్లోని ఏటీఎంలో నుంచి తీసే ఉచిత లావాదేవీల సంఖ్యను 10కి పట్టణాల్లో 12 సార్లకు పెంచేందుకు రెడీ అయిందని సమాచారం.