భద్రకాళి ఫైర్‌వర్క్స్‌ బాధితులకు.. 

ఎక్స్‌గ్రేషియా అందజేత
– కుటుంబానికి రూ.5లక్షల చొప్పున అందించిన డిప్యూటీ సీఎం కడియం
– మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని హావిూ
వరంగల్‌, జులై12(జ‌నం సాక్షి) : భద్రకాళి ఫైర్‌వర్క్స్‌ మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన ఎక్స్‌గ్రేషియాను డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి గురువారం అందజేశారు. పది మంది మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా, డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల పట్టాలను అందించారు. టపాసుల పేలుళ్ల వల్ల దెబ్బతిన్న చుట్టుపక్కల ఇండ్లలోని పేదలకు కూడా డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల పట్టాలను డిప్యూటీ సీఎం అందజేశారు. వరంగల్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ తరపున చనిపోయిన వ్యక్తుల కుటుంబ సభ్యులకు రూ. 20 వేల నగదును అందించారు. మృతుల పెద్దఖర్మ నిమిత్తం అయ్యే ఖర్చులు భరించేందుకు ముందుకు వచ్చి.. నగదు అందజేసిన ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధులకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ దయాకర్‌, ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌, కలెక్టర్లు ఆమ్రపాలి, హరిత, సీపీ రవీందర్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ.. భద్రకాళి ఫైర్‌వర్క్స్‌ మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. చనిపోయిన వ్యక్తుల కుటుంబంలోని పిల్లల చదువుల బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. గాయపడిన వారికి ప్రభుత్వం తరపున చికిత్స అందిస్తున్నామని కడియం తెలిపారు.