భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి

పరిస్థితిని అంచనావేస్తున్న అధికారులు

అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు హెచ్చరిక

భద్రాచలం,ఆగస్ట్‌13(జ‌నం సాక్షి): భద్రాచలం వద్ద గోదావరి వరద ఉద్ధృతి పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో భద్రాచలంలో గోదావరి పోటెత్తింది. ఉరకలు పరుగులూపెడుతూ ఉగ్రరూపం దాల్చింది. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో రోజురోజుకూ నీటి మట్టం పెరుగుతోంది. ఆదివారం 32.5 అడుగులు ఉన్న నీటి మట్టం ఈ రోజు ఉదయం 9 గంటలకు 34.5 అడుగులకు పెరిగింది. భారీగా వరద నీరు వచ్చి చేరడంతో భద్రాలచలంలోని స్నానఘట్టాలు వరద నీటిలో మునిగి పోయాయి. గతనెలలో భద్రాచలం వద్ద వరద తాకిడి 33 అడుగుల వరకూ మాత్రమే వచ్చింది. ఈసారి 34.5 అడుగులు దాటి ప్రవహించడంతో లోతట్టు ప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఏ సమయంలోనైనా వరద నీరు తమ ఇళ్లలోనికి వచ్చే ప్రమాదముందని ఆందోళన చెందుతున్నారు. వరద నీరు పెరిగే అవకాశమున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మూడురోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేరడంతో నీటి నిల్వ సామర్థ్యం మించిపోవడంతో గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. జిల్లాలోని చెరువులు, కుంటలు నిండిపోయాయి. వాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. జనజీవనానికి, రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో టేకులపల్లి మండలంలోని ముత్యాలంపాడు నుంచి ఎగువ గ్రామాలకు, పాల్వంచ మండలంలోని దంతెలబోర నుంచి ఎగువ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరిగింది. జిల్లాలోని ప్రాజెక్టుల, వాగుల నుంచి వరద నీరంతా గోదావరిలోకి చేరడంతో నీటిమట్టం పెరిగింది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి వరదనీటిని మళ్లించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను, సిబ్బందిని ఎమ్మెల్యే జలగం ఆదేశించారు. వర్షాల కారణంగా వస్తున్న వరదల పట్ల జిల్లా వ్యాప్తంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీహన్మంతు సూచించారు. కిన్నెరసాని రిజర్వాయర్‌ నీటి నిల్వ సామర్థ్యం 406 అడుగులకు మించిపోవడంతో ఆరు గేట్లు ఎత్తి 40వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నీటి విడుదల కారణంగా కిన్నెరసాని పరివాహక ప్రాంతంలో ఉన్న మొండికట్ట, కారేగట్టు, ఉల్వనూరు, రెడ్డిగూడెంతో పాటు సుమారు పది గ్రామాలకు రాకపోకలకు నిలిచిపోయాయి.