భద్రాచలం వద్ద పుష్కరఘాట్ల నిర్మాణంలో లోపాలు..

ఖమ్మం: జలాన్ని కాపాడుకోవడానికి చేసే క్రతువే పుష్కరం. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ నెల 14 నుంచి పుష్కరాలు ప్రారంభం కాబోతున్నాయి. ఖమ్మం జిల్లా భద్రాచలం పుష్కర పనుల్లో నాణ్యత లోపాలు కొట్టిచ్చినట్లు కనిపిస్తున్నాయి. అధికార యంత్రాంగంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. నాసిరకం పనులు చేస్తుండడంపై కాంట్రాక్టర్లపై ఆరోపణలు వస్తున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెబుతున్నా.. అవేవీ క్షేత్రస్థాయిలో ఎక్కడా కనిపించడం లేదు. హడావుడిగా పనులను ప్రారంభించి.. నాణ్యత లేకుండానే పనులను చేపట్టారు. ఇటు అధికారులు కూడా కావాల్సినంత దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
షవర్‌ బాత్‌ల వద్ద భక్తులు స్నానాలు చేస్తే.. ఆ నీరు మళ్లీ గోదావరి నదిలోకి…
భద్రాచలంలోని పుష్కర స్నాన ఘాట్టాల వద్ద అధికార యంత్రాంగం తప్పిదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా షవర్‌ బాత్‌ల నిర్మాణంలో లోపాలు కనిపిస్తున్నాయి. షవర్‌ బాత్‌ల వద్ద భక్తులు స్నానాలు చేస్తే.. ఆ నీరు మళ్లీ గోదావరి నదిలోకి రానుంది. దీని వల్ల భక్తులకు మరిన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి. మురుగునీటిని మళ్లీంచేందుకు అధికారులు ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోలేదు.