భద్రాద్రి వద్ద స్వల్పంగా గోదావరి వరద

భద్రాచలం,జులై4(జ‌నంసాక్షి): మహారాష్ట్రలో కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావం గోదావరిపై
స్పష్టంగా కనిపిస్తోంది. మన రాష్ట్రంలో కూడా ఎగువ ప్రాంతంలో వర్షపాతం నమోదవడంతో వాగులు పొంగి పొర్లుతూ వరద గోదావరిలోకి చేరుతోంది. దీంతో కొద్దిగా నీటి ప్రవాహం కనిపిస్తోంది.  ఈ నీటి ప్రవాహం భద్రాచలం వద్ద పరవళ్లు తొక్కుతోంది. గతనెల చివరిలో వారంలో 3 అడుగుల మేర నీటి మట్టం నమోదవ్వగా తొలకరి తర్వాత క్రమంగా నీటి మట్టాలు పెరుగుతున్నాయి. బుధవారం సాయంత్రానికి దాదాపు 12 అడుగులకు చేరింది. ఇంకొంత వరద వచ్చే వీలున్నట్లు అంచనా వేస్తున్నారు. స్నానాల రేవులో సైతం లోతు పెరగడంతో ఎప్పటికప్పుడు గజ ఈతగాళ్లు హెచ్చరిక బోర్డులను మార్చే పనిలో పడ్డారు. భక్తులు ఎక్కడ పడితే అక్కడ స్నానాలు చేయకుండా అప్రమత్తం చేస్తున్నారు.  వరద అడుగులను సూచించే ప్రాంతంలో యువత స్నానాలు చేసేందుకు నదిలో దిగుతున్నందున అక్కడ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. రెండో వంతెన నిర్మాణ పనులకు ఆటంకం ఏర్పడింది. ప్రవాహానికి అడ్డుగా ఏర్పాటు చేసిన తాత్కాలిక రహదారి చాలాచోట్ల నీట మునిగింది. ఇప్పుడిప్పుడే వ్యవసాయ పనులు మొదలు కావడంతో లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి గురించి రైతులు సమాచారం తెలుసు కుంటున్నారు. ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది లేదని అధికారులు అంటున్నారు. అయితే ఎగువన వర్షౄలు పడితే నీటి ప్రవాహం పెరగగలదని భావిస్తున్నారు.