భరోసా కేంద్రం ద్వారా మహిళలకు మరింత అండ


పూర్తయిన భరోసా కేంద్ర నిర్మాణం
9న మంత్రి చేతుల విూదుగా ప్రారంభోత్సవం: డిఐజి
నల్లగొండ,ఆగస్టు7(జనంసాక్షి): జిల్లా కేంద్రంలో నిర్మించిన భరోసా కేంద్రం ద్వారా మహిళలకు మరింత భరోసా కల్పించేలా అన్ని రకాల సౌకర్యాలతో నిర్మాణం పూర్తి చేసినట్లు డీఐజీ రంగనాథ్‌ తెలిపారు. మహిళల సమస్యల పరిష్కారం కోసం కౌన్సిలింగ్‌ రూమ్‌, మహిళా న్యాయవాది, కౌన్సిలర్‌ నియమాకాలు చేపట్టనున్నామని వివరించారు. మహిళ భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో జిల్లాలో మహిళల భద్రత కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జిల్లా కేంద్రంలోని ప్రకాశం బజార్‌లో నిర్మించిన భరోసా కేంద్రం, జిల్లా పోలీసు హెడ్‌ క్వార్టర్స్‌లో నిర్మించిన ట్రాఫిక్‌ ట్రైనింగ్‌
సెంటర్లను ఈ నెల 9వ తేదీన రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి, తెలంగాణ డీజీపీ మహేందర్‌ రెడ్డిల చేతుల విూదుగా ప్రారంభించనున్నట్లు డీఐజీ ఏవీ రంగనాథ్‌ తెలిపారు.ఈ రెండు ప్రారంభోత్సవాలకు తెలంగాణ శాసన మండలి మాజీ చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, నల్లగొండ పార్లమెంట్‌ సభ్యుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌ రెడ్డిలతో పాటు విమెన్‌ సేప్టీ వింగ్‌ అదనపు డీజీపీ స్వాతి లక్రా, వెస్ట్‌ జోన్‌ ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర, హైదరాబాద్‌ రేంజ్‌ ఐజీ శివ శంకర్‌ రెడ్డి, జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, జిల్లా అటవీ అధికారి రాంబాబు హాజరు కానున్నారు. అదే విధంగా ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌ ద్వారా పాఠశాల, కళాశాల స్థాయి విద్యార్థులకు ట్రాఫిక్‌ నిబంధనలు, చిహ్నాల పట్ల అవగాహన కల్పించడం, మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణం అవుతున్న వారికి కౌన్సిలింగ్‌ నిర్వహించడం, సిమిలేటర్‌ సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు డీఐజీ రంగనాథ్‌ తెలిపారు.