భవిష్యత్‌లో పారిశ్రామిక హబ్‌గా సిద్దిపేట

నిరుద్యోగ సమస్యకు పరిష్కారం దిశగా చర్యలు
సిద్దిపేట,మార్చి19(జ‌నంసాక్షి):  రైతులు పండించే పంటల ఆధారంగా వ్యవసాయాధారిత పరిశ్రమలు తీసుకురావడానికి  గతంలో మంత్రిగా ఉన్న  హరీశ్‌రావు చేసిన కృషి వల్ల పలు పనులు సాగుతున్నాయి. జిల్లాను పారిశ్రామిక, సాగునీటి రంగాల్లో అభివృద్ధి పరిచాలన్న సంకల్పంతో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రాంత నిరుద్యోగ సమస్యను నిర్మూలించడానికి పెద్దఎత్తున పరిశ్రమలు తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు  హరీష్‌ రావు చెప్పారు. మిట్టపల్లి, మందపల్లి గ్రామాల శివారుల మధ్యన 300 ఎకరాల్లో ఆగ్రో బేస్‌డ్‌ ఇండస్ట్రీ పరిశ్రమను నెలకొల్పనున్నట్లు తెలిపారు. మరిన్ని పరిశ్రమలు తీసుకురావడానికి ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. పరిశ్రమలు రావాలంటే ముఖ్యంగా భూసేకరణ, నీళ్లు, కరెంట్‌, రైల్వే లైన్‌ అవసరమవుతుందని అన్నారు. త్వరలోనే రైల్వేస్టేషన్‌ కూడా ఏర్పాటు కానున్న నేపథ్యంలో పరిశ్రమల స్థాపనకు అనుకూల పరిస్థితులు ఉన్నాయన్నారు. భవిష్యత్‌లో పారిశ్రామిక హబ్‌గా సిద్దిపేట జిల్లా వేదిక కానుందన్నారు. నంగునూరు మండలం నర్మెటలో 140 ఎకరాల్లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ మంజూరైందని తెలిపారు.
దుద్దెడ వద్ద 100 ఎకరాల్లో మరో పరిశ్రమ ఏర్పాటు కానుందని, ప్రస్తుతం నిర్మాణమవుతున్న కలెక్టరేట్‌ కార్యాలయం పక్కనే ఐటీ పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వాతాతవరణ కాలుష్యం పరిశ్రమలను పెద్దఎత్తున తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. సిద్దిపేట జిల్లా కేంద్రాన్ని నలువైపులా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు.  కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలు తరలివస్తే అన్ని ప్రాంతాలు సస్యశ్యామలం అవుతాయన్నారు. ఈ గోదావరి జలాలతో బీడు భూములను సస్యశ్యామలం చేస్తామన్నారు.  గౌరవెల్లి రిజర్వాయర్‌ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. అలాగే మరోవైపు  మిషన్‌ కాకతీయతో చెరువులను పునరుద్ధరించుకుంటున్నామిన అన్నారు.  సిద్దిపేట, హన్మకొండ రహదారి వైపు జిల్లా పరిషత్‌ కార్యాలయం, కోర్టు భవనాలు, రైల్వే స్టేషన్‌ నిర్మించుకోనున్నట్లు చెప్పారు. దుద్దెడ వైపు కలెక్టరేట్‌ కార్యాలయం, పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయం, ఎన్సాన్‌పల్లి వైపు
మెడికల్‌ కళాశాల, మెదక్‌ రోడ్డులో అగ్రికల్చర్‌ యూనివర్సిటీ, మక్కజొన్న, పొద్దుతిరుగుడు రీసెర్చ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయడంతో పాటు చిన్నకోడూరు వైపు రంగనాయకసాగర్‌ రిజర్వాయర్‌ నిర్మాణంతో పాటు ఉత్తర తెలంగాణలోనే మంచి టూరిజం పాయింట్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు.