భవిష్యత్‌లో స్వర్ణపతకం తప్పక గెలుస్తా

– గెలుపుకోసం తీవ్రంగా ప్రయత్నించా
రజతం సాధించటం పట్ల సంతోషంగా ఉంది
నాకు ఫైనల్‌ ఫోబియా లేదు
విలేకరుల సమావేశంలో స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు
హైదరాబాద్‌,ఆగస్టు 7(జ‌నంసాక్షి) : ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించడం సంతోషంగా ఉందని స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు అన్నారు. భవిష్యత్‌లో స్వర్ణ పతకం సాధించేందుకు శతవిధాలా కృషి చేశానని తెలిపారు. చైనాలో ఇటీవల జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో సింధు రజత పతకం సాధించిన సంగతి తెలిసిందే. అనంతరం స్వదేశానికి చేరుకున్న సింధు మంగళవారం గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్‌ అకాడవిూలో గోపీచంద్‌తో కలసి  విూడియాతో మాట్లాడారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ అనేది పెద్ద టోర్నీ అని.. అక్కడ అందరూ గట్టి ప్రత్యర్ధులే ఉంటారని సింధు అన్నారు. అందరూ పతకం సాధించాలన్న లక్ష్యంతోనే అక్కడికి వస్తారని.. తాను కూడా అలాగే వెళ్లానని తెలిపారు. తాను వంద శాతం ఏకాగ్రతతో ఆడినందువల్లే రజత పతకం సాధించగలిగానన్నారు. తనకు ఫైనల్‌ ఫోబియా లేదని.. చాలామంది ఫైనల్‌కు రాకుండానే వెనుదిరుగుతున్నారని సింధు తెలిపారు. ఫైనల్‌లో ఓడిపోయానని బాధపడే బదులు.. తన ఖాతాలో మరో పతకం వచ్చిందని సంతోషపడతానని పేర్కొన్నారు. వచ్చే ఏడాది తనకు స్వర్ణ పతకం వచ్చేందుకు చాలా అవకాశాలు ఉన్నాయన్నారు. తాను ప్రతిసారి ఫైల్‌కు వచ్చి ఓడిపోతున్నానని చాలామంది అడుగుతున్నారని.. కానీ ఫైనల్‌కు రావడం ఎంత కష్టమో వారు తెలుసు కోవాలన్నారు. ఫైనల్‌లో ఎవరైనా గెలవడానికే ఆడతారని పేర్కొన్నారు. ఫైనల్‌లో ఒడిపోయినందుకు కొంత బాధ ఉన్నప్పటికీ.. తన బలహీనతల నుంచి మరింత నేర్చుకుని అనుకున్న ఫలితం సాధించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని సింధు పేర్కొన్నారు. కోచ్‌ గోపీచంద్‌ మాట్లాడుతూ సిందు అద్భుతంగా ఆడిందని అన్నారు. ఫైనల్లో కొంత ఒత్తిడి ఉన్నా ఎక్కడా తొట్రు పడలేదన్నారు. అయితే ప్రత్యర్థి కూడా బలమైన షట్లర్‌ అని మరచిపోవద్దన్నారు.