భారతీయులు దెబ్బతీస్తున్నారు ..!

1-trumpఅమెరికా తదుపరి అధ్యక్షుడు ట్రంప్‌ భారతీయులకు పెద్ద షాక్‌ ఇచ్చారు. హెచ్‌1బీ వీసాలపై ఇక్కడికి వచ్చి అమెరికన్ల ఉపాధిని దెబ్బతీయడాన్ని తాను ఇకపై సహించబోనని మరోసారి స్పష్టంచేశారు. ఇదే విషయాన్ని ఎన్నికల ప్రచారంలోనూ ఆయన ప్రస్తావించడం గమనార్హం. అమెరికాలో వివిధ కంపెనీల్లో ఈ వీసాలపైనే భారతీయులు వచ్చి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, గురువారం అయోవాలో జరిగిన ఒక కార్యక్రమంలో తన మద్దతుదారులతో జరిగిన సమావేశంలో ఇదే విషయాన్ని ట్రంప్‌ మరోసారి లేవనెత్తారు. ప్రచారం సమయంలో తాను పలువురు అమెరికన్లను కలిశానని, వారి ఉద్యోగాలు పోవడంతో తప్పనిసరిగా కొత్తవారికి శిక్షణ ఇవ్వాల్సి వచ్చిందని, వారి స్థానాల్లో విదేశీయుల్ని తీసుకున్నట్లు తెలిసిందని ట్రంప్‌ పేర్కొన్నారు. మన ఉద్యోగం పీకేసి మన స్థానంలో తీసుకున్నవారికి శిక్షణ ఇస్తేనే కానీ మనకివ్వాల్సిన జీతం మొత్తం ఇవ్వబోమని బెదిరించడం ఎంత దారుణం..అని ట్రంప్‌ అన్నారు. అమెరికన్ల హక్కుల్ని కాపాడడానికి తాను చివరి వరకు పోరాడతానని, డిస్నీ సహా ఇతర కంపెనీల్లో ఈ వీసాలపై వచ్చి వారి ఉపాధిని దెబ్బతీయడాన్ని తాను అనుమతించనని స్పష్టంచేశారు. ట్రంప్‌ ప్రకటన పట్ల అక్కడ మద్దతుదారుల నుంచి హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి.