భారత్‌ క్రికెట్‌కు ధోనీ సేవలు అపరిమితం

అతని గురించి తప్పుగా మాట్లాడే వారిని పట్టించుకోను: కోహ్లీ

మెల్‌బోర్న్‌,జనవరి18(జ‌నంసాక్షి): ఆసీస్‌ గడ్డపై కోహ్లీ సేన సంచలనం సృష్టించింది. సిరీస్‌ ఫలితాన్ని తేల్చే చివరిదైన మూడో వన్డేలో అరోన్‌ ఫించ్‌ సేనపై అద్భుత విజయం సాధించి రికార్డులకెక్కింది. మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తో గెలుచుకుని ఆసీస్‌ టూర్‌ను ఘనంగా ముగించింది. కంగారూలపై ఆ దేశ గడ్డపై టెస్టు, వన్డే సిరీస్‌లను సొంతం చేసుకున్న తొలి భారత కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీ రికార్డులకెక్కాడు. ఆసీస్‌ నిర్దేశిరచిన 231 పరుగుల విజయ లక్ష్యాన్ని ఇంకా నాలుగు బంతులు మిగిలి ఉండగానే కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. అయితే ఈ సిరీస్‌ విజయంలో టీం ఇండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ కీలక పాత్ర పోషించాడు. ఆడిన మూడు వన్డేల్లో, మూడు అర్థశతకాలు సాధించి.. సిరీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సిరీస్‌లో 193 పరుగులు చేసి.. ధోనీ రిటైర్‌ అవ్వాలంటూ కామెంట్‌ చేస్తున్న వాళ్లందరీ నోళ్లు మూయించాడు. దాదాపు ఎనిమిది సంవత్సరాల తర్వాత ధోనీ మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డును అందుకున్నాడు. ఈ సందర్భంగా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ.. ధోనీపై ప్రశంసల వర్షం కురిపించాడు. మ్యాచ్‌ అనంతరం నిర్వహించిన విూడియా సమావేశంలో విరాట్‌ మాట్లాడుతూ.. బయట ఎవరెవరో.. ఎన్నో అంటుంటారు. కానీ మాకు వ్యక్తిగతంగా ధోనీ గురించి తెలుసు. భారత జట్టు పట్ల అందరికంటే ఎక్కువగా అతను నిబద్దతగా ఉంటాడు. అతనికి మనం స్వేచ్ఛనివ్వాలి. భారత క్రికెట్‌కి అతనెంతో సేవ చేశాడు. అతను అందరికంటే ఇంటెలిజెంట్‌ క్రికెటర్‌.. తెలివితక్కువ వాడు కాదు. ఒక జట్టుగా మేం చాలా బ్యాలెన్స్‌గా ఉన్నాము. ప్రపంచకప్‌కి ముందు ఇది మా జట్టుకు ఓ మంచి సంకేతం అని కోహ్లీ పేర్కొన్నాడు.