భారత పర్యాటకులపై థాయ్‌లాండ్‌ దృష్టి

22business-news6aహైదరాబాద్‌: భారత్‌ నుంచి మరింత మంది పర్యాటకులను ఆకర్షించాలని థాయ్‌లాండ్‌ యోచిస్తోంది. ప్రస్తుతం భారత్‌ నుంచి ఏడాదికి 10 లక్షల మందికి పైగా పర్యాటకులు థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌ వంటి పట్టణాలకు వస్తున్నారని, ఏడాదికి 10 శాతం చొప్పున భారత పర్యాటకులు పెరిగే విధంగా మరిన్ని పట్టణాలకు భారత పర్యాటకులను ఆకర్షించడానికి అనేక చర్యలు తీసుకుంటున్నామని టూరిజం అథారిటీ ఆఫ్‌ థాయ్‌లాండ్‌ డైరెక్టర్‌ సరోయా హోమ్‌చెన్‌ తెలిపారు. విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకోవాలనుకునే భారతీయులు థాయ్‌లాండ్‌ వస్తున్నారని, గత ఏడాది 300 భారతీయ పెళ్లిళ్లు థాయ్‌లాండ్‌లో జరిగాయని చెప్పారు. పెళ్లి ఖర్చుతోపాటు అతిథులుగా వచ్చే వారు కనీసం ఒక్కొక్కరు రూ.20,000 వరకూ షాపింగ్‌ చేస్తారని వివరించారు. ఈ నేపథ్యంలో థాయ్‌లాండ్‌లో పెళ్లిళ్లు చేసుకునేందుకు వివిధ సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. అదే విధంగా మహిళ పర్యాటకులను ఆకర్షించడానికి వివిధ చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. థాయ్‌లాండ్‌కు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల నుంచి పర్యాటకులను ఆకర్షించడానికి హైదరాబాద్‌లో రోడ్‌షో నిర్వహించిన సందర్భంగా ఆమె మాట్లాడారు. భారత్‌ నుంచి థాయ్‌లాండ్‌కు వచ్చే పర్యాటకుల్లో దాదాపు 15 శాతం మంది ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల నుంచి వస్తున్నారని పేర్కొన్నారు.