భారీవర్షాలతో చెరువులకు జలకళ

ఎగువన వర్షాలత పెరిగిన నీటిమట్టం

కొత్తగూడెం,జూలై19(జ‌నం సాక్షి): ఎడతెరిపి లేకుండా కురుస్తున్న జోరువానల వల్ల జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు పూర్తిగా నిండిజలకళ ఉట్టిపడుతోంది. కొత్తగూడెం, పాల్వంచ మండలాల్లోని చింతల చెరువు, రాంపురం చెరువు, రాతి చెరువు, పాతపాల్వంచ చింతలచెరువు, భూపతిరావు చెరువు, పూసుగూడెం చెరువు (ములకలపల్లి)లు వరదనీటితో పూర్తిగా నిండిపోయాయి. గుండాల, ఆళ్లపల్లి మండలాల్లోని మల్లన్నవాగు, జిన్నెలవాగు, కిన్నెరసాని వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మణుగూరు, పినపాక, కరకగూడెం, అశ్వాపురం, బూర్గంపాడు, ఇల్లెందు, టేకులపల్లి మండలాల్లో భారీ వర్షం వల్ల చెరువులు, కుంటలు నిండిపోయాయి. జిల్లాలోని అతిపెద్ద ప్రాజెక్టుగా ఉన్న తాలిపేరు రిజర్వాయర్‌ నీటి సామర్థ్యానికి మించి వరదనీరు చేరడంతో పదిహేను గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. భారీ వర్షాల ప్రభావం వల్ల వరదనీరు చెరువులు, కుంటల్లోకి చేరడంతో పూర్తిగా నిండి పోయాయి. జిల్లాలోని సుమారు 200 మిషన్‌కాకతీయ చెరువులు జలకళను సంతరించుకున్నాయి. మిగతా 250 చెరువుల్లో సైతం వరదనీరు చేరింది. తాలిపేరు ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా భారీ వరదనీరు చేరింది. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు గేట్లు ఎత్తివేసి నీటిని విడుదల చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల 25 వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. అశ్వారావుపేట మండలంలోని అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టుగా ఉన్న పెద్దవాగుకు సామర్థ్యానికి మించి వరదనీరు వస్తుండటంతో నీటిని విడుదల చేస్తున్నారు. పాల్వంచ మండలంలోని

కిన్నెరసాని ప్రాజెక్టు నిల్వకు చేరుకునే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. భద్రాచలం డివిజన్‌లోని దుమ్ముగూడెం మండలంలో సీతమ్మవాగు భారీ వరదనీటి కారణంగా పొంగిప్రవహిస్తోంది. తాలిపేరు ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో ఆ వరదనీరు గోదావరిలో కలిసి భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. సుజాతనగర్‌ మండలంలో అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టుగా మిషన్‌ కాకతీయ కింద పునరుద్ధరణ జరిగిన సింగభూపాలెం ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది. గోధుమ, మొర్రేడు, ఎదుళ్లవాగు, పెదవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. పాల్వంచలోని మంచికంటి నగర్‌లో వరదనీరు చేరి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చండ్రుగొండ మండలంలోని వెంగళరావు ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయి మత్తడి పోస్తోంది. అన్నపురెడ్డిపల్లి మండలం అన్నదైవం ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయి మత్తడి పోస్తోంది. అశ్వారావుపేటలోని అంకమ్మ చెరువు, అనంతారం వాగులు పూర్తిగా నిండిపోయాయి. జోరు వర్షాలు

కురుస్తున్న నేపథ్యంలో ఏజెన్సీకి జలకళ ఉట్టిపడుతోంది. పలు ప్రాంతాలు నీటితో నిండిపోతున్నాయి. దుమ్ముగూడెం మండలంలోని కే లక్ష్మీపురం-గౌరవరం మధ్య ఉన్న గుబ్బలమంగి వాగు పొంగింది. దీంతో గిరిజన గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎగువున ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో దిగువ భాగంలో ఉన్న తాలిపేరు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వస్తోంది. భద్రాద్రి వద్ద గోదావరి నీటిమట్టం క్రమేపీ పెరుగుతోంది. వర్షాలు ఇలాగే ఉంటే భద్రాద్రి వద్ద గోదావరి ఉరకలు వేసే అవకాశం ఉంది.