భారీ వర్షాలపై అధికారులతో మంత్రుల సవిూక్ష

జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లకు హెచ్చరిక
వరంగల్‌ ,నల్లగొండ కలెక్టర్లతో మంత్రుల ఆరా
వరంగల్‌,సెప్టెంబర్‌28 జనం సాక్షి : భారీ వర్షాల నేపథ్యంలో ఆయా జిల్లా కలెక్టర్లతో మంత్రులు సవిూక్షించారు. ఎక్కడిక్కడ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వరదపరిస్థితులపై ఆరా తీసారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని హన్మకొండ, వరంగల్‌, మహబూబాబాద్‌, ములుగు, భూపాలపల్లి, జనగామ కలెక్టర్లను రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అప్రమత్తం చేశారు. మంగళవారం ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలపై టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్లతో మాట్లాడి పరిస్థితులను సవిూక్షించారు. గులాబ్‌ తుఫాన్‌ ప్రభావంతో మంగళవారం, బుధవారం భారీ వర్షాలు కురుస్తాయని, ఈ పరిస్థితులలో ఏ విధమైన ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో రెవెన్యూ, పోలీస్‌, పంచాయతీరాజ్‌, నీటిపారుదల, రోడ్లు భవనాల శాఖ సమన్వయంతో కృషి చేసి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా సమర్థవంతంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లలో ప్రత్యేకంగా కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని మానిటరింగ్‌ చేయాలన్నారు. లోతట్టు ప్రాంతాలు చెరువులు, కుంటలు, బ్రిడ్జిల వద్ద ప్రత్యేకంగా అధికారులను నియమించి పరిస్థితులను సవిూక్షించాలన్నారు. ప్రతి మండలంలో ప్రత్యేక అధికారులను నియమించి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా చూడాలని మంత్రి ఆదేశించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మంత్రి జగదీష్‌ రెడ్డి ముమ్మడి నల్లగొండ జిల్లా అధికారులను హెచ్చరించారు. రెస్క్యూ టీంలను అందుబాటులో ఉంచాలని, ప్రమాదాలు సంభవించకుండా విద్యుత్‌ శాఖాధికారులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. గులాబ్‌ తుఫాను రాష్ట్రంలో బీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో మంగళవారం నాడు నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లా కలెక్టర్లతో మంత్రి జగదీష్‌ రెడ్డి టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. గులాబ్‌ తుఫాన్‌ తీవ్రత పెరిగి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విద్యుత్‌ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్‌ రెడ్డి ఆదేశించారు. కాన్ఫరెన్స్‌ సందర్భంగా ఆయా జిల్లాల్లో పరిస్థితులను ఆయన సవిూక్షించారు. ప్రమాదకరంగా ఉండే లోతట్టు ప్రాంతాలను గుర్తించాలని, అలాగే ఆయా ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని ఆయన సూచించారు. వర్షాల వల్ల ఎటువంటి ప్రమాదాలు సంభవించకుండా చర్యలు తీసుకునేలా విద్యుత్‌ శాఖను అలెర్ట్‌ చేయాలని కలెక్టర్లకు చెప్పారు. అదే సమయంలో వైద్య ఆరోగ్యశాఖతో పాటు రెస్క్యూ బృందాలను అందుబాటులో ఉంచాలని ఆయన ఆదేశించారు.