భావితరాలకు మార్గదర్శిగా నిలవండి

మొక్కలు నాటడంలో విద్యార్థులు ముందుండాలి

హరిత పాఠశాల-హరిత తెలంగాణను ప్రారంభించిన కడియం

మొక్కలు నాటి ఆదర్శంగా ఉండాలని పిలుపు

వరంగల్‌,ఆగస్ట్‌25(జ‌నం సాక్షి): మొక్కలను నాటడం ద్వారా విద్యార్థులు భావితరాలకు మంచి వాతావరణం అందించాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. విద్యార్థులు ఈ విషయంలో పెద్దలకు మార్గదర్శకంగా నిలవాలన్నారు. మొక్కలే మన జీవనాధారమని గుర్తించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా హరిత పాఠశాల – హరిత తెలంగాణ కార్యక్రమాన్ని కడియం ప్రారంభించారు. సంగెం మండలం గవిచెర్ల మోడల్‌ స్కూల్‌లో కడియం శ్రీహరి మొక్కలు నాటారు. అనంతరం విద్యార్థినులకు బాలికా ఆరోగ్య రక్ష కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. విద్యార్థుల్ని ఈ ప్రభుత్వం తల్లిదండ్రుల వలె చూసుకుంటుందన్నారు. నాణ్యమైన విద్య, పోషక విలువలు కలిగిన భోజనం, ఆరోగ్య పరిరక్షణ, పరిశుభ్రత కిట్లను ప్రభుత్వం అందిస్తుందన్నారు. విద్యార్థుల చేతుల్లోనే తెలంగాణ భవిష్యత్‌ ఉందని కడియం స్పష్టం చేశారు. అందుకే విద్యార్థులు శారీరకంగా, మానసికంగా ఎదగాలని సీఎం కేసీఆర్‌ సన్నబియ్యంతో కూడిన భోజనాన్ని కడుపునిండా పెడుతున్నారు. నాణ్యమైన విద్య అందించేందుకు విద్యా రంగాన్ని పటిష్టం చేస్తున్నారు.ఇప్పుడు బాలికా ఆరోగ్య రక్ష కిట్లు ఇస్తున్నారని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 5, 6వ తరగతి విద్యార్థినులకు కూడా ఆరోగ్య రక్ష కిట్లను అందజేస్తామన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న వసతులతో విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. భావి తరాలకు మంచి భవిష్యత్‌ అందించాలనే గొప్ప ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్‌ హరితహారం ప్రారంభించారు. మంచి వర్షాలు పడలన్నా, పర్యావరణం బాగుండాలన్న, పంటలు పండాలన్నా పచ్చదనం ఉండాలి. కనీసం 33 శాతం అడవులు ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు తెలంగాణలో ఎక్కడ కూడా 33 శాతం అడవులు లేవు. గోదావరి పరివాహక ప్రాంతంలో అక్కడక్కడా అడవులున్నాయి. ఈ అడవులను పెంచాలని ఈ 5 ఏళ్లలో 230కోట్ల మొక్కలు నాటాలని సీఎం కేసీఆర్‌ హరితహారం చేపట్టారు. ఇప్పటి వరకు 81కోట్ల మొక్కలు నాటారు. హరిత పాఠశాలలో నాటే మొక్కలను విూరు జాగ్రత్తగా పరిరక్షించాలి. ఒక్కో మొక్కను ఒకరు దత్తత తీసుకొని దానిని సంరక్షించాలి అని కడియం శ్రీహరి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, కలెక్టర్‌ హరిత, మోడల్‌ స్కూల్‌ డైరెక్టర్‌ సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు.