భిన్నత్వంలో ఏకత్వం దేశ ప్రత్యేకత

– ప్రధాని మోదీ

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 24,(జనంసాక్షి):’భిన్నత్వంలో ఏకత్వమే’ భారతదేశ బలమని, ప్రతిఒక్కరూ ముఖ్యంగా యువత ఈ విషయాన్ని గుర్తించాలని సూచించారు.ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలతో తన మనోభావాలను పంచుకునేందుకు ఉద్దేశించిన నెలవారీ రేడియో కార్యక్రమం ‘మన్‌కీబాత్‌’ ఆదివారంతో మూడేళ్లు పూర్తిచేసుకుంది. ‘మన్‌కీ బాత్‌’ ప్రారంభమై మూడేళ్లు పూర్తయిందని, ఈ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి ఎన్నో సలహాలు, సూచనలు అందాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దేశ ప్రజలతో అనుసంధానం అయ్యేందుకు, వారి మనోభావాలను తెలుసుకునేందుకు ‘మన్‌కీ బాత్‌’ కార్యక్రమం వేదికగా ఉపయోగపడిందని ప్రధాని మోదీ అన్నారు.రాజకీయాలకు అతీతంగా ప్రజలే కేంద్రంగా ‘మన్‌కీబాత్‌’ కార్యక్రమంలో తాను సంభాషణలు జరిపినట్టు మోదీ తెలిపారు. ‘మన్‌కీ బాత్‌’ వల్ల తమ ప్రభుత్వం ప్రజల పట్ల మరింత సున్నితంగా వ్యవహరించడానికి వీలు కలిగిందన్నారు. ‘స్వచ్ఛతా హి సేవ’ కార్యక్రమానికి భారీ మద్దతు లభిస్తుండటంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ‘స్వచ్ఛ భారత్‌’లో ప్రజలు క్రియాశీలంగా పాల్గొంటున్నారని కొనియాడారు. భారతదేశమంతా ఒక సందర్శకుడిలా కాకుండా ఒక విద్యార్థిలా పర్యటించి.. దేశాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు. ‘స్వచ్ఛత’ రాయబారిగా శ్రీనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నుకున్న 18 ఏళ్ల యువకుడు బిలాల్‌ దర్‌ను ప్రధాని మోదీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. అదేవిధంగా జవానులైన తమ భర్తలు వీరమరణం పొందిన అనంతరం భారత సైన్యంలో చేరిన లెఫ్టినెంట్‌ కల్నల్‌ స్వాతి మహదిక్‌, లెఫ్టినెంట్‌ కల్నల్‌ నిధి దుబేలను ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభినందించారు. వారు దేశానికి స్ఫూర్తి అని పేర్కొన్నారు.